janasena--jd-lakshminarayana-resignsజనసేన పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయంగా పవన్‌ కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.

మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్ననిర్ణయం ఆయన లోని నిలకడ లేని విధి విధానాలను సూచిస్తుందని లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు. అందుకే జనసేన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

అదే సమయంలో విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంటన నడిచిన ప్రతి కార్యకర్తకు, ఓటు వేసిన ప్రతి ఓటరుకి నా కృతజ్ఞతలు. నేను వ్యక్తిగత స్థాయిలో జనసైనికులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు, పౌరులకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ వారందరికీ.. మీకు, మీ కుటుంబసభ్యులకు ఎప్పుడూ మంచి జరగాలని..భగవంతుడి కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు..అని లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు.

గత లోక్ సభ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ విశాఖ లోక్ సభా స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆయన మూడవ స్థానంలోనే ఉండిపోయినా, ఆయన వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. గాజువాక సెగ్మెంట్ లో ఆయన పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం విశేషం.