janasena candidate Dr. Srinubabu Gedela withdraws from elections 2019జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 32 ఎమ్మెల్యే అభ్యర్థులను, నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన గేదెల శ్రీను జారిపోయారని సమాచారం. తాను పోటీకి సరిపోనేమోనని ఆయన నేతల వద్ద అబిప్రాయపడ్డారని జనసేనకు మద్దతుగా ఉన్న 99టీవీలోనే వచ్చింది. దీనిపై ఆ టీవీ వారు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదట.

పై పెచ్చు ఆయన బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతానని చెప్పారట. దీనితో జనసేన వర్గాలు ఢీలా పడిపోయాయట. రెండు మూడు రోజులు వేచి చూస్తీ అవసరమైతే అభ్యర్థిని మార్చే అంశం కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గం కింద ఉన్న గాజువాక నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనే వార్తలు వస్తున్నా గేదెల శ్రీను పోటీకి ధైర్యం చెయ్యకపోవడం విశేషం. మరోవైపు బీఎస్పీ, వామపక్షాలతో జనసేన సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతుంది.

మరోవైపు జనసేన దాని మిత్రపక్షాలతో కలిసి మొత్తం 175 స్థానాల నుండి పోటీ చేస్తుందా అనే అనుమానాలు ఇంకా ఉండడం విశేషం. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు ప్రకటించింది. ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుండి పోటీ చేసే వారి లిస్టు ప్రకటిస్తారట. 100 స్థానాలకు తగ్గకుండా అభ్యర్థుల లిస్టు ఉండబోతుందని సమాచారం. ఈ క్రమంలో జనసేన ఈ విషయంలో చాలా వెనుకబడి పోయింది అనే అనుకోవాలి.