Pawan Kalyan - Somu Veerrajuతిరుపతి ఉపఎన్నిక సీట్ లో మేము పోటీ చేస్తాం అంటే మేము పోటీ చేస్తాం అంటూ బీజేపీ, జనసేన పార్టీలు చాలా కాలమే చర్చలు నడిపాయి. మొత్తానికి ఏదో కారణంగా వెనక్కు తగ్గి పవన్ కళ్యాణ్ ఆ సీటుని బీజేపీకి ఇవ్వడానికి అంగీకరించారు. అయితే మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆ సీట్ బీజేపీకి వదిలిపెట్టడమే మంచిదైందని జనసైనికులే అనడం విశేషం.

తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ కింద చిత్తూర్, నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. తిరుపతిని ఉదాహరణగా తీసుకుంటే… తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలో 27 డివిజన్లకు గానూ జనసేన కేవలం రెండు చోట్ల మాత్రమే అభ్యర్థులను నిలబెట్టగల్గింది. బీజేపీ తొమ్మిది చోట్ల అభ్యర్థులను పెట్టింది.

ఇక ఓట్ల సంగతికి వచ్చే సరికి… దాదాపుగా 70,000కు పైగా ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో జనసేన కేవలం 231 ఓట్లు మాత్రమే సాధించింది. అలాగే బీజేపీ 2,546 ఓట్లు తెచ్చుకుంది. దీనిబట్టి తిరుపతిలో జనసేనకు పట్టు లేదని అర్ధం అవుతుంది. బీజేపీ పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నా… ఘోర ఓటమి చెందిన సమయంలో ఆ అవమాన భారం జనసేనకు తప్పినట్టు అవుతుంది.

ఒకరకంగా ఆ సీటు బీజేపీకి వదిలిపెట్టడం జనసేనకు మంచిదే అయ్యిందని అభిమానులే ఒప్పుకుంటున్నారు. స్థానిక ఎన్నికల వచ్చిన ఫలితాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ ఉపఎన్నికలో కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తుంది.