janasainiks upset with pawan kalyanఒక పక్క తిరుపతి ఉపఎన్నికలో ఎవరు పోటీ చేస్తారు అనే దాని మీద బీజేపీ – జనసేన నాయకులు చర్చలు జరుపుతున్నాం అంటూ ఊదరగొడుతున్నారు. అయితే తెరమాటున బీజేపీ పోటీ చెయ్యడానికి సిద్ధం అయిపోతుంది. తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ ను బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేశారని వార్తలు వస్తున్నాయి.

రత్నప్రభ ప్రకాశం జిల్లాకు చెందిన వారు. గతంలో ఆమె వైఎస్ ప్రభుత్వం లో పని చేశారు. జగన్ అవినీతి కేసులలో ఒక అక్రమ మైనింగ్ కేసులో అప్పట్లో నిందితురాలిగా చేర్చారు. అయితే ఆ తరువాత హైకోర్టు కి వెళ్లి కేసు కొట్టేయించుకున్నారు. మొన్న ఆ మధ్య ట్విట్టర్ లో వైఎస్ గురించి అడిగితే పొగిడేసి చివర్లో రాజువయ్యా మహారాజువయ్యా అంటూ స్వామి భక్తి చాటుకున్నారు.

బీజేపీ పోటీ చేస్తుండడం ఒక ఎత్తు అయితే…. వైఎస్ జగన్ కి అనుకూలమైన అభ్యర్థిని పెట్టడంతో జనసైనికులు మరింత ఆగ్రహం చెందుతున్నారు. అసలు ఇదంతా పవన్ కి తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా అని వారు అడుగుతున్నారు. బీజేపీ పోటీ చేస్తేనే నష్టం… అటువంటి పరిస్థితిలో వైఎస్సాఆర్ పార్టీ కి అనుకూలమైన అభ్యర్థి అంటే రాజకీయంగా కూడా నష్టం అని వారి భావిస్తున్నారు.

మరోవైపు… ఇప్పటికే తిరుపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇప్పుడు రత్నప్రభ కంఫర్మ్ అయితే రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మహిళా అభ్యర్థులనే బరిలోకి దింపినట్టు అవుతుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం దివంగత ఎంపీ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకుండా జగన్ సొంత ఫీజియోథెరపిస్ట్ కు టిక్కెట్ ఇవ్వడం గమనార్హం.