Jana-Reddy BJPతెలంగాణలోని నాగార్జున సాగర్ లో ఉపఎన్నిక అనివార్యం కావడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల మీద దృష్టి పెట్టాయి. అందరి దృష్టి మాజీ మంత్రి జానా రెడ్డి పై ఉండటం గమనార్హం. జానా రెడ్డి పైకి కాంగ్రెస్ లోనే ఉంటా అని చెబుతున్నా తెరవెనుక బీజేపీ తో మంతనాలు జరుపుతున్నారని కాంగ్రెస్ లోనే వినిపిస్తుంది.

ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచనలో జానారెడ్డి లేరని, తనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ ని చేసి, తన కుమారుడు రఘువీర్‌రెడ్డి బరిలో దింపాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. జానారెడ్డి అయితేనే అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలమని బీజేపీ అనుకుంటుందంట. పార్టీ మారిన వారిని గవర్నర్ చేస్తే బాగోదు అని కూడా ఆలోచిస్తుందంట.

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు లైఫ్‌ అండ్ డెత్‌ సమస్య. జానారెడ్డి స్వయంగా బరిలో ఉంటే ఎంతో కొంత అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తుంది. 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన మూడు ఎన్నికలలో జానా రెండు సార్లు గెలిచారు.

2018లోనే మొదటి సారిగా ఓడిపోయారు. అప్పటినుండి ఆయన కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. 2018 ఎన్నికలలో నాగార్జున సాగర్ లో బీజేపీ కేవలం 1.48% ఓట్లు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. సరైన అభ్యర్థి లేక బీజేపీ అక్కడ సతమతం అవుతుంది. తెరాస నోముల న‌ర్సింహ‌య్య కుటుంబసభ్యులకే సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది.