Janardhan-Reddy-Trying-To-Buy--MLA-BJPసుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మైండ్ బ్లాక్ అయిన బిజెపి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, తమకు ఎమ్మెల్యేల బలం లేదన్న విషయం బహిరంగమే. దీంతో “ఎలాగైనా” రేపు సాయంత్రానికి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ‘బళ్ళారి బాబు’ మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం ఓ ఆడియో టేప్ ద్వారా నిరూపణ అయ్యింది.

రాయ్ చూర్ రూరల్ ఎమ్మెల్యే బసవగౌడతో జరిపిన “లైఫ్ సెటిల్మెంట్” ఆడియో టేప్ ను కాంగ్రెస్ నేత ఉండ్రప్ప మీడియాకు అందించారు. దీంతో బిజెపి భాగోతం బట్టబయలైంది. గతంలో చాలామంది లైఫ్ లను సెటిల్ చేసానని, ఇప్పుడు మీకు కూడా సెటిల్ చేస్తానని గాలి చేసిన వ్యాఖ్యలు ఈ ఆడియో టేప్ లో స్పష్టంగా వినపడుతున్నాయి. గాలి జనార్ధన్ రెడ్డి – బసవ గౌడ మధ్య జరిగిన సంభాషణ ఎలా జరిగిందో పరిశీలిస్తే…

బసవ : ఎస్, చెప్పండి

గాలి : మీరు ఫ్రీగా ఉన్నారా?

బసవ : ఎస్, నేను ఫ్రీగానే ఉన్నాను

గాలి : గతంలో ఏం జరిగిందో అంతా మరిచిపోదాం, నాకు మంచి టైం మొదలైంది. జాతీయ అధ్యక్షుడితో కూర్చుని మాట్లాడిస్తా, మీకు ఏ పోస్ట్ కావాలంటే అది ఇప్పిస్తా, మీరు ఏది అడిగితే అది! రేపు వేయబోయే అడుగు ముందు ఒక్కసారి మాట్లాడుకుందాం.

బసవ : కాదు సర్, వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా చేసారు, నా చేయి పట్టుకుని ఇక్కడ దాకా తీసుకువచ్చారు.

గాలి : నేను మీకో విషయం చెప్తాను, నా టైం సరిగా లేనపుడు బిఎస్ఆర్ పార్టీని స్థాపించాను, అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి, నువ్వు మొత్తం ఆశలను వదిలేసుకున్నావ్, కానీ ఇప్పుడు నీకు 100 రెట్లు మెరుగుగా అందిస్తాను. శివన్ గౌడ నాయక్ నా మాటలు వినడం వలనే ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యాడు, రాజు గౌడ కూడా అంతే!

బసవ : నిజమా?

గాలి : మనకు గతంలో వర్కౌట్ కాదు, అప్పుడు టైం బాలేదు, కానీ ఇప్పుడు శివన్ గౌడ నాయక్ గెలిచినా ప్రయోజనం లేదు, కానీ నువ్వు మంత్రి అయ్యే అవకాశం ఉంది. అర్ధమైంది అనుకుంటా?

బసవ : హా

గాలి : నిన్ను అధిష్టానం ముందు కూర్చోబెడతా, ప్రస్తుతం దేశాన్ని పాలిస్తోన్న ప్రభుత్వం, మాట మీద నిలబడతారు. నేను ప్రామిస్ చేస్తున్నా… ఇప్పటివరకు నువ్వు ఎంత అయితే సంపాదించుకున్నావో, అంతకు 100 రెట్లు ఎక్కువ వస్తుంది.

బసవ : సారీ సర్, నాకు టికెట్ ఇచ్చి గెలిపించారు, వాళ్ళని మోసం చేయలేను, మీ మీద నాకు గౌరవం ఉంది.

ఇలా సాగిన ఫోన్ సంభాషణ రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. నిజానికి ఇలాంటివి జరుగుతాయన్న విషయం బహిరంగమే గానీ, సాక్ష్యాలతో బయటపడడం బిజెపికి షాక్ ఇచ్చినట్లయ్యింది. ఇంతేకాదు, హైదరాబాద్ తాజ్ హోటల్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో శాస్త్రి అనే వ్యక్తి ఫోన్ చేసి స్వయంగా వచ్చి చర్చలు జరిపినట్లుగా మీడియా వర్గాలలో వస్తున్న వార్తలు బిజెపి తీరును ప్రజలకు స్పష్టంగా చూపిస్తున్నాయి.