Jana-Sena-Yatra---Pawan-Kalyanఒక్క షాట్ తీసి రెండు రోజులు విశ్రాంతి తీసుకునే శరీరం, ప్రతి రోజు, ప్రతి క్షణం ప్రజా జీవితంలో కష్టపడాలంటే అలవాటు పడాల్సి ఉంది. ప్రస్తుతం దానిని గాడిలో పెట్టుకునే పనిలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన అనంతరం విజయనగరం జిల్లాలో పర్యటిస్తారనుకున్న సమయంలో… బ్రేక్ తీసుకున్న పవన్, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పర్యటనను హైలైట్ చేసుకునే పనిలో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ కు ప్రజలు బ్రహ్మరధం పట్టారని, అశేషమైన జనవాహిని రావడం ఇందుకు నిదర్శనమని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం చెప్పుకొచ్చారు. పవన్ పై సంపూర్ణ విశ్వాసంతో ప్రజలు ఉన్నారని, ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కీలకమైన వ్యాఖ్యలు చేసారు. వచ్చిన వారంతా ఓటు వేస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే పవర్ స్టార్ కున్న క్రేజ్ రీత్యా జనాలు రావడం అనేది అంచనాలు వేసిందే.

అలాగే “ప్రజలు మార్పు కోరుకుంటున్నారు” అన్నది కూడా నిజమే. ఆ మార్పు జనసేన అధినేతలోనూ, వైసీపీ అధినేతలోనూ కలగాలని కోరుకుంటున్నారు. ఏపీ అభివృద్ధి కాకుండా అడుగడుగునా అడ్డుపడుతోన్న బిజెపికి వంత పాడుతోన్న జగన్ మరియు పవన్ లలో మార్పు రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం రొటీన్ రాజకీయ నాయకుల మాదిరి చవకబారు విమర్శలు చేస్తోన్న జనసేన అధినేతలో మార్పు వచ్చి, ఆదర్శవాదమైన రాజకీయాలు చేయాలన్న మార్పును కోరుకుంటున్నారు. మరి ఇది సాధ్యమేనా? ‘పవన్ అండ్ జగన్’లలో ఆ మార్పు వస్తుందా? ఏమంటారో జనసైనికులు..?!