Pawan-Kalyan-Addresses-The-Basic-Problem-of-Janasenaమెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రజల దృష్టిలో ఎంతగా చులకన అయ్యారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక రాజకీయ నాయకుడిగా విఫలమైన చిరు, హీరోగా మాత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ‘ఖైదీ నెంబర్ 150’ ద్వారా తన స్టామినాను పూర్తిగా నిరూపించుకున్నారు. ప్రస్తుతం చిరు సోదరుడు పవన్ పయనం కూడా అదే రూట్లో సాగుతోందన్న వాదన క్రమక్రమంగా బలపడుతోంది.

బిజెపి ఉచ్చులో పవన్ చిక్కుకున్నారన్న ఆరోపణలు బలంగా ప్రజల్లోకి వెళ్ళడంతో, రాజకీయాల్లో ఏదో చేస్తారని భావించిన ప్రజానీకాన్ని పవన్ పూర్తిగా నిరుత్సాహపరిచారు. అంతేగాక క్రమంగా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ‘జనసేన’ వెళ్తుండడం వీరాభిమానులను సైతం నివ్వెరపరుస్తూ, విమర్శలతో మీడియాలకు ఎక్కేలా చేస్తోంది. ఈ తరుణంలో ఒకవేళ పవన్ సినిమాలలో కనిపిస్తే… మునుపటి క్రేజ్ ఉంటుందా? అన్న అంశం అత్యంత ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే… ఎప్పటిలాగానే నితిన్ తన సినిమా విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ పేరును వినియోగించడంతో, ‘చల్ మోహన్ రంగ’ సినిమాలో పవన్ ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. స్వయంగా పవన్ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో పవన్ ఉండడు గానీ, ఉన్నట్లే ఉంటుందని నితిన్ చెప్పిన మాటలు పవర్ స్టార్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే తన సినిమాలలో ఏదొక సీన్లో పవన్ కళ్యాణ్ ఫోటోనో, వీడియోనో వినియోగించడం నితిన్ కు పరిపాటి అన్న విషయం తెలిసిందే.

బహుశా ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలనే చొప్పించి ఉండొచ్చు. మరి ఈ ప్రభావం ‘చల్ మోహన్ రంగ’ సినిమా ఓపెనింగ్స్ పై పడుతుందా? సహజంగానే నితిన్ సినిమాలకు పవన్ కళ్యాణ్ అభిమానుల హంగామా ఎక్కువగా ఉంటుంది. తాజా పుకారుతో ఈ ఒరవడి మరింత ఎక్కువగా ఉంటుందా? అనేది చూడాలి. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా రేంజ్ పైన పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు పవన్ నిర్మాత కూడా!