Pawan Kalyan Bus Yatra2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కర్ణాటకలో ఎలా అయితే త్రిముఖ పోటీ నెలకొందో, ఆంధ్రప్రదేశ్ లోనూ దాదాపుగా అదే స్థాయిలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. అధికారంలో ఉన్న టిడిపి బలంగా కనిపిస్తుండగా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇక తన బలం, బలగం ఎంతో తెలియని జనసేన అధినేత, దీనిపై స్పష్టత కోసం పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతున్నారు.

పేరుకు త్రిముఖ పోటీ అయినప్పటికీ, ప్రధానంగా టిడిపి – వైసీపీల నడుమే పోటీ ఉంటుందన్నది బహిరంగమే. అయితే భవిష్యత్తు రాజకీయాల రీత్యా ‘జనసేన’ స్టామినా ఏమిటో రాష్ట్రానికి, కేంద్రానికి తెలపాల్సిన ఆవశ్యకత పవన్ కళ్యాణ్ పై ఉంది. మరో ఏడాది ఉంది గనుక, అప్పటికి జనసేన పుంజుకుంటే, ప్రస్తుత కర్ణాటక ఫలితాలలో జేడీఎస్ పార్టీ మాదిరి, ఏపీలో కూడా ‘జనసేన’ ఉద్భవిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారిన చర్చ. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే… జనసేనకు అన్ని సీట్లు వచ్చే అవకాశాలు లేవన్నది స్పష్టం.

నేడు 35 సీట్లు సంపాదించుకోవడానికి జేడీఎస్ కు చాలా కాలం పట్టింది. మరి ఫస్ట్ టైంలోనే ‘జనసేన’ అన్ని సీట్లు కొల్లగొడుతుందా? నిలకడలేని పవన్ కళ్యాణ్ పై ప్రజలు అంత బాధ్యతను, నమ్మకాన్ని ఉంచుతారా? నిజంగా అది జరగాలంటే పవన్ కళ్యాణ్ పగలు, రాత్రి అనకుండా చాలా శ్రమించాల్సి ఉంటుంది, అంతేకాదు కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగా కాకుండా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటూ, తన మార్గాన్ని ప్రజలకు సవివరంగా తెలపాల్సి ఉంటుంది.