Mega-Fans-Meet--Pawan-Kalyan-Jana-Senaఅందరి జీవితాలలో సెంటిమెంట్లు ఉండడం సహజం. అయితే సినీ, రాజకీయ రంగాలలో ఈ పోకడ బాగా ఎక్కువన్న విషయం తెలియనిది కాదు. ముఖ్యంగా అయిదేళ్ళకొకసారి అధికారం దక్కే పొలిటికల్ విభాగంలో అయితే ఈ సెంటిమెంట్ రాజ్యమేలుతుంటాయి. ఉదాహరణకు ఎన్నికలు దగ్గరకు వచ్చేపాటికి రోజా, మైసూరారెడ్డి వంటి వారి పేర్లు రాజకీయ వర్గాలలో బలమైన సెంటిమెంట్స్ గా పరిగణిస్తారు. ఆయా నేతలకు ఉన్న ఫ్లాష్ బ్యాక్ రీత్యా, సదరు నేతలను పార్టీలోకి తీసుకుంటే ప్రతిపక్షానికి పరిమితం కావడం ఖాయమనే టాక్ నేడు ఉత్పన్నమైనది కాదు.

మరి ఈ సెంటిమెంట్స్ జనసేన అధినేత చెవిన పడ్డాయో లేదో గానీ, త్వరలోనే మైసూరారెడ్డి జనసేనలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ పక్కన రాబోయే ప్రభుత్వం తమదే అంటూ ప్రచారం చేసుకుంటోన్న జనసైనికులకు మాత్రం ఈ విషయం అస్సలు మింగుడు పడడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చినపుడు కాంగ్రెస్ కు వచ్చి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటపుడు టిడిపిలోకి వెళ్లి, టిడిపి పగ్గాలు చేపట్టినపుడు వైసీపీలోకి జంప్ అయిన మైసూరారెడ్డి, ఇప్పుడు జనసేన జెండా పట్టుకుంటే ఏమవుతుందో అన్న ఆందోళన పవన్ అభిమానుల్లో నెలకొన్న మాట వాస్తవం.

గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటోన్న ఈ సీనియర్ పొలిటిషియన్, జనసేనకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలే ఈ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేసాయి. ఏపీ రాజకీయాలలో జనసేన సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉందని, కాపులు రాజ్యమేలే సంకేతాలు కనపడుతున్నాయని చెప్పడంతో మైసూరా జనసేనలోకి ఎంట్రీ ఇస్తారన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇదే జరిగితే… జనసైనికులకు కంటి మీద కునుకు పడుతుందా? లేక మైసూరా ట్రాక్ రికార్డును మార్చే సత్తా జనసేన అధినేతకు ఉందని నిరూపించుకుంటారా? కాలమే సమాధానం చెప్పాలి.