Jana-Sena---Pawan-Kalyanగత రెండు రోజులుగా ‘జనసేన’ అధినేత చేస్తున్న కామెంట్స్ తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. వర్తమాన రాజకీయాలతో పాటు “ప్రజారాజ్యం” పార్టీని వెనుకేసుకోస్తూ… తన సోదరుడు చిరంజీవిని సమర్ధిస్తూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తన అన్నయ్య చిరంజీవికి కూడా ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు, మరోసారి చిరుపై తనకున్న ప్రేమను చాటిచెప్పినట్లయ్యింది తప్ప, ఆ వ్యాఖ్యల్లో పస లేదన్న విషయం తెలిసిందే.

మరింత లోతుగా చెప్పాలంటే… తదుపరి కాలంలో ‘జనసేన’ బాధ్యతలను నెమ్మదిగా చిరు నెత్తిన పెట్టేలా చేయబోతున్నారా? అన్న ప్రశ్నలను కూడా పవన్ వ్యాఖ్యలు లేవనేత్తుత్తున్నాయి. ఒక హీరోగా చిరంజీవికి ఉన్న గుర్తింపు ఎవరితోనూ పోల్చలేం గానీ, ఒక నాయకుడిగా, ప్రజా సేవకుడిగా చిరుకున్న ఇమేజ్ అత్యంత దయనీయమనే చెప్పవచ్చు. ఆ ఇమేజ్ ను పవన్ తన వ్యాఖ్యలతో సవరించే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే గత రెండు రోజులుగా ‘ప్రజారాజ్యం’ పల్లవిని కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.

చిరు అంటే పవన్ ఎప్పుడూ అభిమానమే అన్న విషయం బహిరంగమే. రాజకీయాల్లోకి వచ్చి ఇంతకాలం గడిచినా, చిరు రాజకీయ శైలిపై పవన్ ఒక్క నెగటివ్ కామెంట్ కూడా చేయలేదు. దానికి తోడు ప్రస్తుతం ‘నెగటివ్’ పక్కనపెట్టి, ‘పాజిటివ్’లోకి మారడం, పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేస్తుందన్న విషయం గమనించుకోవాలి. ఎందుకంటే… పవన్ గానీ, మెగా ఫ్యాన్స్ గానీ ఒప్పుకున్నా, లేకున్నా… ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా చిరంజీవి షో ‘అట్టర్ ఫ్లాప్’ అని చెప్పకతప్పదు. మున్ముందు కూడా ఇలాంటి పల్లవినే పట్టుకుంటే, అది పవన్ కే ముప్పు అని గమనించుకోవాలి.