Jana Sena Pawan Kalyan Tweets on Rohith Vemula and Cow Slaughtingగోవధ, గోసంరక్షణపై బీజేపీని తీవ్ర స్థాయిలో నిలదీసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోహిత్ వేముల మృతిపై నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ వ్యవహార శైలిని తూర్పారపట్టారు. దేశంలో కొన్ని లక్షల మందిలా రోహిత్ వేముల కూడా బీజేపీని వ్యతిరేకించాడు లేదా ద్వేషించాడు. అంత మాత్రాన వేధింపులకు దిగుతారా? వ్యతిరేకించడం అంటే వేధింపులకు లైసెన్స్ ఇచ్చినట్టా? అని సూటిగా ప్రశ్నించారు.

తమను వ్యతిరేకించేవారిపై వేధింపులకు దిగడం సరైన విధానం కాదన్న విషయాన్ని బిజెపితో సహా దేశంలోని ఇతర పార్టీలన్నీ గుర్తించాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల్లో అభిప్రాయ బేధాలు ఉండడం సర్వసాధారణమని, ఒక వ్యక్తి తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంటే అతనికి సరైన విధానంలో కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి, అతనిని లక్ష్యం చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడి పరిష్కారాలు కనుగొనాలి తప్ప వేధింపులకు దిగడం, కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడం హర్షణీయం కాదని స్పష్టం చేశారు.

దురదృష్టవశాత్తూ ఈ ఘటనలో కేంద్రం నేరుగా జోక్యం చేసుకుందని, దీనికి తోడు యూనివర్సిటీ సస్పెన్షన్ వేటు వేయడం, అంతటితో ఆగకుండా యూనివర్సిటీ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించడం, ఈ క్రమంలో అతను ఎవరి గ్రూపులో ఉన్నాడో ఆ గ్రూపు నుంచి అవసరమైన సహకారం అందకపోవడం కూడా అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్ వేముల ఆగ్రహం, నిరాశానిస్పృహలకు దారితీసిందని, ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తికి సరైన కౌన్సిలింగ్ అవసరమని, అది రోహిత్ వేములకు అందలేదని అన్నారు.

ఈ ఘటనలో అన్నింటికంటే బాధాకరమైన అంశమేంటంటే… రోహిత్ వేముల ఆత్మహత్యను బీజేపీయేతర రాజకీయ పార్టీలు వాటి స్వలాభానికి వాడుకోవాలని చూస్తే… బీజేపీ దాని మిత్రపక్షాలు రోహిత్ వేముల దళితుడు కాదని నిరూపించడంలో బిజీగా మారిపోయాయని మండిపడ్డారు. వీళ్లంతా భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మన యూనివర్సిటీలు విద్యాలయాలుగా కంటే రాజకీయ పార్టీల బలం నిరూపించుకునే మైదానాలుగా మారిపోవడం బాధాకరమని పవన్ కల్యాణ్ ఘాటుగా విమర్శించారు.

పవన్ చెప్పిన దాంట్లో విమర్శించడానికి ఏమీ లేదు గానీ, ఇదే విషయాలు రోహిత్ వేముల ఉదంతం హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తున్న నేపధ్యంలో స్పందిస్తే… సమస్యకు పరిష్కార మార్గాలను సూచించిన వారిగా మిగిలేవారు. అలా కాకుండా ఇతర రాజకీయ పార్టీల మాదిరే రోహిత్ ఉదంతాన్ని ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమో పవనే పునరాలోచించుకోవాలి. జనవరి 17వ తేదీతో రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఏడాది కాలం ముగుస్తున్న తరుణంలో… సదరు విషయాలను ఇప్పుడు ప్రస్తావించడం అనేది పసలేని విమర్శలులా మిగిలిపోతుంది. అయితే బిజెపిపై ఎదురుదాడి చేయడానికి పవన్ ఈ అంశాన్ని వినియోగించుకుంటున్నారా? అన్న కోణంలో కూడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.