jana-sena-pawan-kalyan-tweets-on-demonetizationపెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఉన్నదెవరు? ప్రధాని నరేంద్ర మోడీనా? ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేలా? ఈ ప్రశ్నకు సమాధానం దేశంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పేస్తాడు. మరి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ ప్రశ్నకు సమాధానం తెలియదా? ‘నోట్ల రద్దు అంశం సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ఆ క్రెడిట్ నా ఒక్కడిదే’ అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి రాలేదా? ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావడానికి పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్వీట్స్ ఊతమిచ్చాయి.

నోట్ల రద్దుపై ప్రస్తావిస్తూ… ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎత్తకుండా, ఆర్బీఐ గవర్నర్ ను టార్గెట్ చేసుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ‘జనసేన’ అధినేత. కర్నూలులో బాలరాజు వంటి ఎందరో వ్యక్తులు బ్యాంకుల ముందు క్యూ లైన్ లో మరణించడానికి తమ అద్భుతమైన మేధోమధనం నుంచి ఉద్భవించిన ‘డీమోనిటైజేషన్’ అని ఉర్జిత్ పటేల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 69 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో మానవత్వంతో ఏ ప్రభుత్వమూ తీసుకునేందుకు సాహసించని నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుందని, సువిశాల భారతదేశంలో ‘క్యాష్ లెస్ ఎకానమీ’ ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించారు.

మీరు అనాలోచితంగా సూచించిన ఈ నిర్ణయం వల్ల దేశంలోని ఎన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారో తెలుసా? దేశాన్ని నాశనం చేసిన దుర్మార్గులంతా ఇంట్లో కూర్చుని డబ్బులు మార్చుకుంటుంటే… నిరుపేదలు, నిస్సహాయులు, దేశ ప్రజలు మాత్రం క్యూ లైన్లలో నిల్చున్నారని మండిపడ్డారు. మీరు నల్లధనాన్ని రద్దు చేసేశామని, దేశాన్ని అవినీతి రహితంగా మార్చేశామని సంకలు గుద్దుకుని ఎగరవచ్చని ఎద్దేవా చేసిన పవన్, వాస్తవంగా జరిగింది ఏమిటంటే… పాత విధానాలకు బదులు కొత్త విధానాలను చూపించారు, అలాగే బ్యాంకింగ్ ఉద్యోగులకు పర్సెంటేజ్ రూపంలో ఓ అవకాశం కల్పించారు… అంటూ ట్వీట్స్ చేసారు.

అయితే ఇవన్నీ పవన్ ఒక్కడే వేలెత్తి చూపినవి కావు. దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలు, మరెంత మందో ఆర్ధిక నిపుణులు వ్యక్తపరిచారు. ఈ అభిప్రాయాలకు తనపై విమర్శలు వస్తాయని భావించారో ఏమో గానీ, ఈ రోజు పూర్తిగా తన అభిప్రాయాన్ని చెప్పడం కుదరలేదని మరొక ట్వీట్ చేసారు. అయితే పవన్ ఎక్కుపెట్టిన ‘బాణం’ మాత్రం గురితప్పిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వీటన్నింటికి కారణమైన ప్రధాని మోడీ పేరును ప్రస్తావించకుండా, కేవలం ఆర్బీఐ గవర్నర్ పేరును మాత్రమే ప్రస్తావించడం వెనుక కారణం… గతంలో చెప్పినట్లు… ‘వ్యక్తిగతంగా మోడీని కలిసినపుడు తనకంటూ ఓ అవకాశం ఉంచుకోవడానికి’ అని చెప్పకతప్పదు.