Pawan-Kalyan-On-A-Sticky-Wicket-or-Being-Extra-Cautiousఎన్నికలు పూర్తి అయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యి ఉంది. అవి తెరుచుకునేది వచ్చే నెల 23నే. మే 19న దేశవ్యాప్తంగా పోలింగ్ పూర్తి అయ్యే వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది ఎన్నికల కమిషన్ దీనితో కనీసం ఆ ముచ్చట కూడా లేకుండా పోయింది. దీనితో ఎవరి లెక్కలు వారివి. జనసేన పార్టీకి ఈ ఎన్నికల మీద ఎటువంటి అంచనాలు లేవు కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు సీట్లు గెలిచి…. జనసేన ఖాతా రెండు అంకెలు దాటితే చాలు అనుకుంటున్నారు.

అలా జరిగితేనే పార్టీ మనుగడ ఉంటుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ కే ఇంట్రెస్ట్ పోయే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితి ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా గెలుపుపై నమ్మకం కుదరడం లేదు. ఎన్నికల ముందు వరకు గాజువాక నుండి ఆయన గెలవడం పక్కా అని, భీమవరం మాత్రం హోరాహోరీగా అవుతుందని విశ్లేషిస్తూ వచ్చారు. పోలింగ్‌ సరళిని చూసిన తర్వాత రెండు చోట్లా పవన్‌ విజయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అయితే కొందరు అభిమానులు మాత్రం అత్యుత్సాహంతో భారీ ఎత్తున బెట్టింగులకు దిగబడుతున్నారు.

పవన్ కళ్యాణ్ రెండు చోట్లా గెలుస్తాడని, గాజువాకలో 50000 మెజారిటీ వస్తుందని, భీమవరంలో పాతిక వేల మెజారిటీఅని ఇలా ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బెట్టింగులకు దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ వారు అనుకున్నట్టు గెలిస్తే పర్వాలేదు. ఓడిపోతే మాత్రం ఎన్నో కుటుంబాలు నాశనం కావడం ఖాయం. పవన్ కళ్యాణ్ కూడా అభిమానులు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని పిలుపునిస్తే మంచిది. పవన్ కళ్యాణ్ గెలుపుతో పాటు జేడీ లక్ష్మీనారాయణ, నాగబాబు, నాదెండ్ల మనోహర్ గెలుపుల మీద కూడా బెట్టింగులు భారీగా జరుగుతున్నాయి.