Pawan Kalyan, Pawan Kalyan Birthday AP Special Status, Jana Sena Pawan Kalyan Birthday AP Special Status, Power Star Pawan Kalyan Birthday AP Special Statusపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కాలం చేసిన రోజు అయినటువంటి సెప్టెంబర్ 2వ తేదీ ఏపీ చరిత్రలో కీలకం కాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. ఇటీవల తిరుపతి వేదికగా పవన్ వినిపించిన స్వరం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించడంతో ఒక్కసారిగా ‘స్పెషల్ స్టేటస్’ అంశం వేడెక్కింది. కేవలం ఆ ఒక్క రోజు మీడియా సమావేశానికి మాత్రమే పరిమితం కాకుండా, ‘ప్రత్యేక హోదా’పై భవిష్యత్తు కార్యాచరణ కూడా పవన్ ప్రకటించడంతో ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం ఊపందుకుని చర్చలు జరిగాయి.

తాజాగా మంగళవారం నాడు కూడా వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అమిత్ షా, అరుణ్ జైట్లీలు సమావేశం అయ్యి, స్పెషల్ స్టేటస్ పై మరియు విభజన చట్టంలో ఉన్న అంశాలపై చర్చలు జరిపారు. ఈ నేపధ్యంలో త్వరలోనే ఒక కీలక నిర్ణయం రానుందని, ప్రస్తుతం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. దీనిపై వెంకయ్య నాయుడు కూడా టిడిపి వర్గాలకు మద్దతు పలికారని, దీంతో ‘ప్రత్యేక హోదా’ మరియు ఇతర అంశాలపై కేంద్రం దృష్టి సారించిందన్న వార్తలు ప్రధానంగా మీడియా వర్గాలలో ప్రసారమయ్యాయి.

అయితే తాజా సమాచారం మేరకు… సెప్టెంబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపధ్యంలో… ఆ పర్యటనకు ఒక రోజు ముందు… అంటే సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ‘ప్రత్యేక హోదా’కు కేంద్రం సానుకూలంగా ఉందన్న వార్తలు మరింత ఆసక్తిని పెంచుతోంది. అలాగే విభజన చట్టంలో ఉన్న మిగిలిన హామీలు, ప్యాకేజ్ విషయంలో కూడా ప్రధాని స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి.

ఇప్పటివరకు వేచిచూసే ధోరణిలో ఉన్న ఏపీ సర్కార్ ఇటీవల తీవ్రంగా స్పందించడం మరియు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వేడిని రాజేయడంతో… ఇక నాన్చుడు ధోరణితో బిజెపికే నష్టమని భావించడం వలనే, రాజకీయ పరిణామాలు వేగంగా మారాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే ఏపీలో మిత్రపక్షాలుగా టిడిపి మరియు జనసేనలను దూరం చేసుకుంటే, రాష్ట్రంలో బిజెపికి రాజకీయ మనుగడ కష్టం అన్న ఆలోచన కూడా ఈ కీలక నిర్ణయంలో ఓ పాత్ర పోషించిందని తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇలా కేంద్రం నుండి సానుకూల ప్రకటన వస్తుందని వేచిచూడడం, ఆ తర్వాత నిరాశ చెందడం ఏపీ ప్రజల వంతయ్యింది. మరి ఈ సారి ఏమవుతుందో చూడాలి?