pawan-kalyan-advice-to-sri-reddyకథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య తనను ఎంతో కలచివేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదని, ఏదైనా దారుణం జరిగితే కానీ మనలో చలనం రావడం లేదని చెప్పారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని, కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని… అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు.

సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని, పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుందని… కానీ మానవ మృగాలకు ఎలాంటి నియమాలు లేకుండా పోయాయని మండిపడ్డారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే వారిని వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తనకు తెలుసని, అమ్మాయిలు ఇంటికి చేరేంత వరకు భయపడుతూ ఉండే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు 200 మంది యూనిట్ సభ్యులం ఉన్నామని… అయినా బయటివారు వచ్చి, సినిమాకి సంబంధించిన అమ్మాయిలను వేధించారని… అప్పుడు తాను కర్ర పట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

అమ్మాయిలను రక్షించుకునేందుకు కఠినమైన చట్టాలు ఉండాలని జనసేన డిమాండ్ చేస్తోందని, మన వ్యవస్థలో మార్పులు కోసం పోరాడుతామని తెలిపారు. ఇక సినీ పరిశ్రమలో జరుగుతున్న వేధింపులపై స్పందిస్తూ… టీవీ స్టూడియోల్లో కూర్చుంటే న్యాయం జరుగుతుందా? పోలీసులను ఆశ్రయించాలని పరోక్షంగా శ్రీరెడ్డి ఉదంతాన్ని ప్రస్తావించారు. అత్యాచారాలకు కారణం సినిమాలు అనడం కరెక్ట్ కాదని, దుర్మార్గులను వెనుకేసుకు రావడం రాజద్రోహంతో సమానమని పవన్ తన భావాలను వెల్లడించారు.