Pawan-Kalyan-Jana-Senaప్రస్తుతం ఉన్న ప్రణాళిక ప్రకారం అయితే వచ్చే ఏడాదిలో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రావాల్సి ఉంది. అయితే కేంద్రం నుండి అందుతున్న సంకేతాలతో ఈ ఏడాది చివర్లోనే మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినపడుతోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ చేయడానికి ‘జనసేన’ బరిలో ఉంటుందని, తదుపరి సార్వత్రిక ఎన్నికలలో తన క్యాండిడేట్స్ నిలబడతారంటూ పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే అంటూ అభిమానులు ఊహల్లో మునిగి తేలుతున్నారు.

అయితే వీరికి స్పష్టత ఇచ్చేందుకో లేక ప్రస్తుతం తనకు అంత స్టామినా లేదని చెప్పడానికో గానీ, తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తో 2019 ఎన్నికలలో ముఖ్యమంత్రి స్థానం నుండి పవన్ కళ్యాణ్ ‘అవుట్’ అన్న విషయం స్పష్టమైంది. 2014లో తెలుగుదేశం + బిజెపి ద్వయానికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరే చేస్తానని తెలిపారు. అయితే ఎన్నికల ముందు గానీ, తర్వాత గానీ తన జనసేన పార్టీ ఎవరికీ మద్దతు తెలుపుతుంది అనే అంశంపై ఈ రోజు కీలక ప్రకటన చేసారు.

తదుపరి ఎన్నికలలో తాను ఎవరికీ మద్దతు తెలుపుతాను అనే ప్రశ్న అందరిలోనూ ఉందని, ఎవరైతే రైతులకు అండగా ఉంటారో వారికే తన మద్దతు అని, అలాగే అనంతపురం రైతాంగం కన్నీరును ఎవరు తుడుస్తారో వారికి తన సహకారం ఉంటుందని అన్నారు. ఏ పార్టీకైనా మద్దతిచ్చే ముందు అనంతపురంకు ఏం చేస్తారు? అని అడుగుతానని, ఆ తర్వాతే తన అండదండలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అసలు ఏ పార్టీకి మద్దతు అన్న అంశం ఒక్క క్షణం పక్కన పెడితే, పవన్ ఆలోచనలు ఇంకా మద్దతు తెలపడంలో ఉండడం శోచనీయం.

ఓ పక్కన అభిమానులేమో ‘కాబోయే సిఎం’ అంటూ జైజై నాదాలు పలుకుతుంటే… మరో పక్కన తానేమో ఇంకా మరో పార్టీకి మద్దతు తెలపడంలోనే ఉన్నారంటే… అసలు పవన్ కళ్యాణ్ కు పూర్తి స్థాయిలో పోటీ చేసే ఆలోచన లేదని తేటతెల్లం అవుతోంది. అలాగే ముఖ్యమంత్రి పీఠం ఇప్పట్లో తాను ఎక్కేది కాదన్నది పవన్ కు స్పష్టంగా తెలిసిన విషయం. నిజానికి పవన్ ఆలోచనలు సరైనవే. ఇప్పటివరకు కేవలం ఒక హీరోగా ఉన్న వ్యక్తి, ఒక్కసారిగా సిఎం సీటు ఎక్కి యేవో అద్భుతాలు చేస్తారనుకోవడం కేవలం ఊహల్లో తేలినట్లే అవుతుంది.

కనుక తన ఫ్యాన్స్ ను కూడా ఆకాశంలో కాకుండా నేలపై ఉంచేలా పవన్ ప్రకటనలు చేస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పటివరకు ఫ్యాన్స్ కు పెద్దగా సూచనలు చేయని పవన్, ఇటీవల కాలంలో కాస్త గైడెన్స్ ఇస్తున్నారు. తాను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే ఈలలు వేయడమేంటి? అలా చేయవద్దు అంటూ హితవు పలికిన సంఘటన కూడా నేడు నమోదు చేసుకుంది. దీంతో తన పట్ల, తన స్థాయి పట్ల పవన్ కు ఫుల్ క్లారిటీ ఉన్నట్లుంది..! ఇక ఉండాల్సింది ఫ్యాన్స్ కే కాబోలు… అందుకే ఈ వరుస సిగ్నల్స్..!