Pawan-Kalyan-Repeating-Praja-Rajyam-Mistakeఎన్నికల తరువాత తన మొదటి రాజకీయ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పక్షం మీద విరుచుకుపడ్డారు. ఇసుక కొరతతో అల్లాడుతున్న ఆ రంగం కార్మికులను ఆదుకోవడానికి, ఇసుకను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వానికి రెండు వారాల టైం ఇచ్చారు పవన్. లేకపోతే ఈ సారి అమరావతి వీధులలో నడుస్తా అంటూ హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అది వ్యూహాత్మక తప్పిదం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు జగన్ రెడ్డే కాదు.. సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే తనకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండేదే కాదని పవన్ వ్యాఖ్యానించారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలలోకి తిరిగిరావడం కంఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో పింక్ రీమేక్ లో ఆయన నటిస్తున్న ప్రాజెక్టు గురించి అధికారిక ధృవీకరణ కూడా వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేస్తే జగన్ అద్భుతంగా పాలిస్తున్నాడు అని ఒప్పుకున్నట్టే కదా అంటున్నారు పలువురు విశ్లేషకులు.

అయితే జగన్ అద్భుతంగా పాలిస్తే తాను పూర్తిగా రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటా అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అన్నారని జనసేన అభిమానులు భాష్యం చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా సినిమాల్లోకి తిరిగి రావడం గురించి పవన్ కళ్యాణ్ నిన్నటి సభలో ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు.