Jana-Sena-Party-Pawan-Kalyan-Electionsజనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ చేపట్టింది.వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల లో పార్టీ పోటీ చేసే విషయమై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది. పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అద్యక్షతన ఈ భేటీ జరిగింది. 2009 ప్రజారాజ్యం పార్టీ అనుభవాల దృష్ట్యా ఎక్కడా డబ్బు అనే అంశానికి ప్రాధాన్యం లేకుండా నిబద్ధత, కష్టపడి పని చేసే తత్వం ఆధారంగానే అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారట ఇందులో పార్టీ అధినేతగా తనకు కూడా మినహాయింపు లేదంటూ పవన్ కళ్యాణ్ తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి తొలి దరఖాస్తుగా సమర్పించారు.

అంతకు ముందు పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో కూర్చుని అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియకు నియమాలను ఖరారు చేశారని జనసేన పత్రికా ప్రకటనలో తెలిపింది. అంటే తన అభ్యర్థిత్వాన్ని ఓకే చేసే కమిటీకి ఎలా పని చెయ్యాలో కూడా పవన్ కళ్యాణే చెప్పేశారు. అంటే ఈ మొత్తం ప్రక్రియలో ఆ కమిటీ నామ్ కే వస్తే అనే కదా అర్ధం. ప్రాంతీయ పార్టీలలో నిర్ణయాలు ఆ పార్టీల అధినేతలే తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఏదో కొంచెం డిఫరెంట్ పార్టీ అనిపించుకోవడానికి ఈ తిప్పలు అంతే.

అసలు స్క్రీనింగ్ కమిటీ అనేదే లేని సమయంలో పవన్ కళ్యాణ్ పితాని బాలకృష్ణకు సీటు ఖరారు చేశారు కదా? ఇప్పుడు కొత్తగా ఆయన తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి తొలి దరఖాస్తుగా సమర్పించడం ఏంటో? ఎన్నికలకు పట్టుమని మూడు నెలల సమయం కూడా లేదు. నిజంగా ఈ స్క్రీనింగ్ ప్రక్రియ చేపడితే అది ఎప్పటికి పూర్తి అవుతుంది? జనసేన ఇటువంటి పబ్లిసిటీ స్టంట్ల మీద దృష్టి పెట్టి టైమ్ వేస్ట్ చెయ్యకుండా బలమైన అభ్యర్థులను గుర్తించడానికి ప్రయత్నం చెయ్యాలి. నిజానికి కనీసం రాష్ట్రంలోని సగం స్థానాలకు కూడా ఆ పార్టీకి ప్రస్తుతానికి అభ్యర్థులు లేరు.

కనీసం నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను కూడా పెట్టె ప్రయత్నం చెయ్యడం లేదు. జనసేన పోరాట యాత్ర అంటూ మొదలు పెట్టి కనీసం అన్ని జిల్లాలకు తిరగలేకపోయారు. నిజం చెప్పాలంటే టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఖరారు చేస్తే అసంతృప్తులు బయటకు వస్తారు వారికి సీట్లు ఇవ్వొచ్చని జనసేన ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పరిస్థితుల బట్టి చివరి నిముషంలో జనసేన ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడం గానీ, లేదా పరిమితమైన సీట్లలో పోటీ చెయ్యడం గానీ చేసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.