jana-sena-mla-rapaka-varasad-rao-abhishekam-to-ys-jagan-flexiపోయిన ఎన్నికలలో జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు గెలిచింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయినా పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ రాజోలు నుండి గెలిచారు. అయితే ఆ ఆనందం జనసేన అభిమానులకు ఎక్కువ కాలం నిలవడం లేదు. ఆయన ఎప్పుడు అవకాశం దక్కినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యేనో తెలీకుండా ఉంటున్నారు.

తాజాగా ముఖ్యమంత్రి జగన్ బొమ్మకు పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి బ్యానర్ కు అభిషేకం చేశారు. వాహన మిత్ర కింద ఆటోడ్రైవర్ లకు ప్రభుత్వం పది వేల రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేసిన నేపథ్యంలో ఆటో డ్రైవర్లు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్‌ ఆటోస్టాండ్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌ తో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. వరప్రసాదరావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్‌ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన అభిమానులు కంగుతిన్నారు.

చూడబోతే ఈయన ఎక్కువ కాలం పార్టీలో ఉండరు అని వారే అనుకోవడం విశేషం. 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక ఆ తరువాత 2014, 2019 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్టు కోసం గట్టిగా ప్రయత్నించారు జగన్ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన ఎన్నికల ముందు జనసేనలో చేరారు. అయితే ఇప్పటికీ ఆయన మనసు జగన్ వద్దనే ఉన్నట్టు ఉంది.