No-Matter-What,-Pawan-Kalyan-Will-be-Kingmakerకౌంటింగుకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ మే 23.. అంటే 43 రోజుల వ్యవధి అవ్వడం వల్ల జనంలో కాస్త అసహనం కూడా కనిపిస్తోంది. రెండు ప్రధాన పక్షాలు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ విజయంపై ధీమాగానే ఉండడం గమనార్హం. అయితే దీనితరువాత అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం జనసేన ఈ ఎన్నికలలో ఎలా రాణిస్తుంది అనేది. ఆ పార్టీ వల్ల ఏ పార్టీ విజయావకాశాలు దెబ్బ తింటాయి అనేదాని మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్నికల ముందు వరకు జనసేన ప్రభావం పెద్దగా ఉండదని టీడీపీ, వైసీపీ నేతలూ భావించారు.

అయితే పోలింగ్‌ తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు పది శాతంపైనే ఓట్లు వస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. రెండు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంకా ఎక్కువే ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పలుచోట్ల క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన ఓటర్లు పలు చోట్ల ఒక ఓటు జనసేనకు ఇంకో ఓటు టీడీపీ లేక వైఎస్సార్ కాంగ్రెస్ కు వేసినట్టు తెలుస్తుంది.

ఇటువంటి సందర్భంలో వోటింగ్ సరళిని అంచనా వెయ్యడం కూడా కష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీడీపీకి లాభం చేకూరుతుందా? లేక టీడీపీ ఓటు చీల్చి వైఎస్సార్ కాంగ్రెస్ కు మేలు చేస్తుందా అనేది కూడా చూడాలి. ఇదంతా ఎలా ఉన్నా జనసేన కనీసం 15 సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ తన రెండు సీట్లు గెలిస్తే గానీ ఆ పార్టీకి మనుగడ లేదు అని అనుకునే వారు కూడా ఉన్నారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ కనబరిచిన ప్రదర్శన జనసేన రిపీట్ చేస్తే ఆ పార్టీ సంతృప్తిగా ఉండవచ్చు.