jana-sena-kapu-party-pawan-kalyan2009లో ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో బీసీలకు మాత్రమే 100 సీట్లు కేటాయించి సంచలనం సృష్టించింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో బీసీలకు అన్ని సీట్లు ఇచ్చిన దాఖలాలు ఏ పార్టీకూ లేవు. జనాభాలో అత్యధిక శాతం ఉండే బీసీలను ఆకట్టుకుంటే గెలుపు తేలిక అని అప్పట్లో చిరంజీవి భావించారు అయితే ఆ ప్రయోగం ఫలితాన్ని ఇవ్వలేదు. అదే విధంగా సామాజిక న్యాయం సూత్రం కూడా పని చేసినట్టు అయ్యింది. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పని చెయ్యాలని అనుకోవడం లేదంట.

“సిద్ధాంతాలకు రాజకీయంలో చోటు లేదని పవన్ కళ్యాణ్ కు ప్రజారాజ్యం రోజులలోనే అర్ధమై పోయింది. దీనితో ఈసారి కులాల వారీగా టిక్కెట్లు ఇవ్వడం జరగదు. గెలుపు గుర్రాలకే పెద్ద పీట వెయ్యాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పార్టీకు అండగా ఉండే కాపులకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు. కృష్ణ, గుంటూరు, కొన్ని రాయలసీమ ఏరియాలలో ఎక్కడ కాపులు ఎక్కువ ఉంటే అక్కడ వారికే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అనుమానాలకు తావు లేదు,” అని ఒక పార్టీ సీనియర్ నేత అన్నారు.

అయితే ఇలా చేస్తే పార్టీ మీద కుల ముద్ర పడదా అంటే. “కచ్చితంగా పడుతుంది. ఒకరకంగా కాపు పార్టీ అనే ముద్ర పడితే మాకు మంచిదే. నిజానికి మేము దానిని స్వాగతిస్తాం. పైకి వ్యతిరేకించినా కాపులు ఎక్కువగా ఉండే చోట అత్యధిక సీట్లు గెలిస్తే సొంతంగా అధికారంలోకి వచ్చినా రాకపోయినా తరువాత ఏర్పడే ప్రభుత్వంలో మా పాత్ర లేకుండా ఉండదని మా అంచనా. అందుకే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలలో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు,” అని ఆ నాయకుడు అంటున్నారు.

ఇటీవలే చేనేత వర్గాలతో మీటింగులో పవన్ కళ్యాణ్ ను వారు తమ కులస్తులకు రెండు సీట్లు కేటాయించాల్సిందిగా కోరారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేనలో కులాలవారీగా కాకుండా గెలిచే సామర్ధ్యం బట్టే ఉంటుందని కుండ బద్దలు కొట్టేశారు. కులాలకు సీట్లు కేటాయించడం కంటే వారి సమస్యలను తీర్చగలిగితేనే వారికి మంచి జరుగుతుందని పవన్ వారికి సర్ది చెప్పడం కొసమెరుపు. దీనిబట్టి పవన్ కళ్యాణ్ తన మనసులో మాట చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.