Jana-Sena-Alliance--Andhra-Pradesh-Politicsచిరు స్థాపించిన ‘ప్రజారాజ్యం’ మాదిరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవస్థాపన చేసిన ‘జనసేన’ కూడా ఏదొక పార్టీలో విలీనం కాక తప్పదా? ఆ దిశగా సాగడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు బాటలు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఓ అభిమాని విషయంలో ‘జై పవనిజం’ అంటూ పవనిజానికి అసలు అర్ధం చూపించిన అభిమానుల పైశాచికత్వం, భవిష్యత్తు పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయని చెప్పవచ్చు. నేడు ఏదో ఒక అనామకుడు పవన్ పోస్టర్ ను చెప్పుతో కొట్టడంతో, ఆ ఒక్కడిని పట్టుకుని, అదే తమ “అభిమానం”గా ప్రదర్శించుకోవడం వివాదాస్పదమైంది.

వర్తమానం కట్ చేసి ఒక్కసారి భవిష్యత్తుకు వెళితే…. నిజంగా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే… ఇలాంటి పోస్టర్ చెప్పుదెబ్బలేం కర్మ, భారీ బహిరంగ సభలలో నిజమైన చెప్పులు కూడా పవన్ పైకి వచ్చిపడే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే… ఆ తరహా రాజకీయాలే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆ మాటకొస్తే… నేడే కాదు, గతంలో కూడా ప్రముఖ సినీ సెలబ్రిటీలపై, అలాగే ప్రముఖ రాజకీయ నేతలపై ఇలాంటి తరహా ఘటనలు బోలెడు నమోదయ్యాయి. కొన్ని సందర్భాలలో అయితే ఏకంగా ముఖ్యమంత్రుల పైకే ప్రత్యర్డులు బూట్లు విసిరిన సందర్భాలు ఇండియన్ పొలిటిక్స్ కు కొత్తేమీ కాదు.

అంటే ప్రత్యక్ష రాజకీయాలలోకి అన్నింటికీ సిద్ధమై రావాలి. బహుశా పవన్ ఇందుకు సిద్ధంగా ఉన్నా, ఆయన అభిమానులు అంగీకరించే ప్రసక్తి లేకపోతే, ‘జనసేన’ను ఏదొక పార్టీలో విలీనం చేసి, తిరిగి చిరు మాదిరి పవన్ కూడా సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆచరణలో ఇది జరిగినా, లేకున్నా ప్రస్తుతం తన అభిమానులను నియత్రించుకోలేని పరిస్థితులలో పవన్ కు ఇవే పరిణామాలు ఎదురవుతాయంటూ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి పోకడల వలన సామాన్య ప్రజలలో ‘జనసేన’ పట్ల ఏహ్యభావన ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

నేడు ఒకరినైతే పట్టుకుని కొట్టగలిగారు గానీ, రేపు ప్రత్యక్ష రాజకీయాలలో రోజుకొకరు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంటారు. వాటిన్నింటిపై కూడా ఇలా రియాక్షన్స్ వస్తే… పరిస్థితులు పవన్ చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ… మెగాస్టార్ చిరంజీవే. ఎందుకంటే… అప్పటివరకు చిరును ఒక మాట అనడానికి కూడా ఆలోచించిన వారు, రాజకీయాల్లోకి రాగానే ఏకంగా బూతులు తిట్టే స్థాయికి వచ్చారంటే, రాజకీయాలు ఎలాంటి వారి చేతైనా ఏ పనులు చేయిస్తాయో అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత తన అభిమానులే చిరును తిట్టుకునే స్థాయికి రాజకీయాలు ప్రతిష్టను దిగజార్చాయి.

కాబట్టి, అభిమానులకు నిజంగా పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థానాలను అధిరోహించాలన్న కోరిక ఉంటే, ఇలాంటి చిన్న చిన్న ఉదంతాలకు స్పందించకపోవడం ఉత్తమం. ఒకవేళ స్పందిస్తూ… ఇలాంటి పోకడలే చేస్తాము అంటే… అది తమ అభిమాన హీరో మరియు అభిమాన నేతకు చేస్తోన్న కీడే తప్ప, మంచి కాదని ప్రస్తుతం తెలియకపోయినా, భవిష్యత్తు ఖచ్చితంగా తెలిసేలా చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఒక్క మహేష్ కత్తి నోరు మాత్రమే లేస్తోంది, మరో ఆరు నెలలు ఆగితే, ఇంకెన్ని స్వరాలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తారో!? అన్నింటిలోనూ తాము వేలుపెడతాము అంటే గనుక, చివరికి కాలేది అభిమాన హీరో భవిష్యత్తు అని గుర్తుంచుకోవాలి.