అదేదో సామెత చెప్పినట్టు రామేశ్వరం వెళ్లినా మెదడులో ఉండే శనీశ్వరం బుద్దులు ఎక్కడికి పోతాయి. అచ్చంగా అలాగే ఉన్నాయి మన స్టార్ హీరోల అభిమాన గణం బుద్దులు. ఒకపక్క తెలుగు సినిమా ఆస్కార్ గడప తొక్కబోతోంది. ఎవరూ కలలో కూడా ఊహించుకోలేనంత గొప్ప ప్రతిష్టను రాజమౌళి దక్కించుకుంటున్నారు. సి పుల్లయ్య. కెవి రెడ్డి, కె విశ్వనాథ్ లాంటి ఎందరో దిగ్గజాలకు సాధ్యం కానీ ఘనతను అందుకుని దేశ విదేశీయుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇది రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరూ గర్వపడే విషయం.
దీనికి కారణం ఆర్ఆర్ఆర్ అని మళ్ళీ విడమరిచి చెప్పనక్కర్లేదు. గోల్డెన్ గ్లొబ్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సహా టీమ్ మొత్తం లాస్ ఏంజిల్స్ వెళ్ళింది. అంతకు ముందు జపాన్ ప్రీమియర్లకు హాజరై ప్రమోట్ చేయడం వల్ల ఆ దేశంలో హయ్యస్ట్ ఇండియన్ గ్రాసర్ గా నెంబర్ వన్ సింహాసనాన్ని దక్కించుకుంది. అకాడమీ నామినేషన్లకు టైం దగ్గర పడుతున్న వేళ అందరి మద్దతు జక్కన్నకు దక్కుతోంది. ఇంటర్నేషనల్ మీడియా సైతం ట్రిపులార్ కు ఖచ్చితంగా పురస్కారం దక్కడం పట్ల గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.
సాక్ష్యాత్తు జేమ్స్ క్యామరూన్ మూడు నిమిషాలకు పైగా రాజమౌళిని మెచ్చుకోవడం, ఒకవేళ హాలీవుడ్ లో సినిమా తీసే ఆలోచన ఉంటే చెప్పు కలిసి మాట్లాడుకుందాం అన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అవతార్ లాంటి వరల్డ్ క్లాస్ మాస్టర్ పీస్ ఇచ్చిన ఆల్ టైం గ్రేట్ డైరెక్టర్ నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ అందుకోవడం కంటే కావాల్సింది ఏముంది. జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ తీయక ముందే టైటానిక్ తో వేలకోట్ల వసూళ్లను కోట్లాది హృదయాలను గెలుచుకున్న లెజెండ్ పొగడ్త కంటే ఆస్కార్ గొప్పదా. ఇలాంటి సంతోషడాల్సిన టైంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ఇద్దరు ముచ్చటించుకున్న వీడియోని రిలీజ్ చేసింది.
మూవీ లవర్స్ పదే పదే చూసుకుని మురిసిపోయారు. కానీ హీరోల ఫ్యాన్స్ తీరే మరీ విచిత్రంగా ఉంది. క్యామరూన్ ఫ్లాష్ బ్యాక్ గురించి గొప్పగా చెప్పాడని అది రామరాజు గురించేనని చరణ్ అభిమానులు, కళ్ళు తెరిచే ఎక్స్ ప్రెషన్లు గురించి చెప్పాడు కాబట్టి అది భీమ్ ఇంట్రో గురించని తారక్ ఫ్యాన్స్ ఇలా అర్థం లేని వాదనలతో మీమ్స్ ట్రోల్స్ చేస్తూ పెరగాల్సిన పరువును ట్విట్టర్ వేదికగా తగ్గించేస్తున్నారు. అసలు ఆయన అన్నది రాజమౌళి విజన్ గురించి, స్టోరీ నెరేషన్ కు ఎంచుకున్న పంథా గురించి. అంతే తప్ప జేమ్స్ క్యామరూన్ కి నటీనటుల పేర్లు కూడా అంతగా అవగాహన ఉండదు. ఏడాది దగ్గరవుతున్నా ఇంకా హీరోల గొప్పల గురించి లేనిపోని గప్పాలు పోతున్న ఫ్యాన్స్ అజ్ఞానానికి ఏం పేరు పెట్టాలో.