Avatar The Way of Waterప్రపంచవ్యాప్తంగా ఒక సినిమాకు సమాన స్థాయిలో క్రేజ్ రావడం చాలా అరుదు. ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా కేవలం అవతార్ అనే బ్రాండ్ ఇమేజ్ తో ఇవాళ విడుదలైన ది వే అఫ్ వాటర్ భారీ ఓపెనింగ్స్ మధ్య తన పరుగు మొదలుపెట్టింది. నిజానికి దీనికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రమోషన్లు చేయలేదు. పైపెచ్చు దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఇది ఫ్లాప్ అయితే మూడో భాగంతో ఆపేస్తానని ఆపై తీసినా వృధాని ముందే చెప్పేశారు. దానికి తోడు పదహారు వేల కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని సాధిస్తుందానే అనుమానం వరల్డ్ ట్రేడ్ లో బలంగానే ఉంది. ఇవి చాలవన్నట్టు అడ్వాన్స్ ప్రీమియర్ల నుంచి వచ్చిన డివైడ్ టాక్ అభిమానులకు ఖంగారు పుట్టించింది.

మొత్తానికి థియేటర్లలో అడుగు పెట్టేసింది. ఇక కంటెంట్ విషయానికి వస్తే అవతార్ 2 నిజంగా విజువల్ ఫీస్ట్ అంటే కనులకింపుగా ఉన్న గ్రాఫిక్స్ మాయాజాలం. ఊహలకు ఏ మాత్రం అందని పండోరా నేపధ్యాన్ని మరోసారి అబ్బురపరిచేలా చూపించారు. అలా అని ఫస్ట్ పార్ట్ కంటే గొప్పగా ఈ అవతార్ 2 మొదటి భాగాన్ని తలదన్నేలా లేదనే అభిప్రాయం మూవీ లవర్స్ లో వ్యక్తమవుతోంది. దానికి ప్రధాన కారణం నిడివి. మూడు గంటల పన్నెండు నిముషాలు ఎలాంటి పాటలు లేకుండా రన్ చేయడం అంటే హాలీవుడ్ మూవీస్ కి ఎప్పుడో కానీ జరగదు. అయినా కూడా రిస్క్ చేసి కోత వేయలేదు. అంత ఓపిగ్గా కన్నార్పకుండా చూసేందుకు ఇవి బెన్ హర్ నాటి రోజులు కావు.

తన ప్రెజెంటేషన్ మీద నమ్మకంతో ఎడిటింగ్ లోనూ పాలు పంచుకున్న క్యామరూన్ తగ్గేదేలే సూత్రాన్ని పాటించి లెన్త్ ని అలాగే ఉంచేశారు. ఫస్ట్ హాఫ్ అరగంటయ్యాక ల్యాగ్ ఫీలింగ్ రావడానికి కారణం ఇదే. ఎంతసేపటికీ కథ ముందుకు కదలదు. నీళ్ల అడుగులో కొన్ని సుదీర్ఘమైన సన్నివేశాలు చిరాకు పెట్టించలేదంటే అది అబద్దమే అవుతుంది. శత్రువులు సముద్ర జలచరాల మీద బాంబులు మిస్సైల్స్ తో దాడి మొదలుపెట్టాకే అసలైన కిక్ వస్తుంది. అక్కడి నుంచి ప్రేక్షకులకు పండగే పండగ. ఎమోషన్లను బలంగా రిజిస్టర్ చేయడం కోసం పాత్రల మధ్య సంబంధాలను ఎస్టాబ్లిష్ చేసిన తీరు కూడా కొంచెం సాగతీతకు కారణం కావడాన్ని కాదనలేం.

అవతార్ 2 గురించి సోషల్ మీడియాలో సామాన్య ప్రేక్షకుల్లో సెలబ్రిటీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజువల్ వండర్ అని ఒకరు, ఇలాంటి ఎక్స్ పీరియన్స్ క్యామరూన్ మాత్రమే ఇవ్వగలరని మరొకరు, తాతకు మా సెల్యూట్ అంటూ ఓ యువకుడు ఇలా పొగడ్తల వర్షం కురిపించారు. నిర్మాత నాగ వంశీ ఇది అచ్చం మెరైన్ డాక్యుమెంటరీలా ఉందని 3డిలో చూసినందుకు మాస్టర్ పీస్ అనాల్సి వస్తోందని కాస్త వ్యంగ్యంగా కౌంటర్ వేశారు. డల్ గా ఉందని, అవతార్ 1 కంటే గొప్పగా ఊహించుకుంటే నిరాశపరిచిందని ఇలా వేర్వేరు ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా అవతల షోలు మాత్రం హౌస్ ఫుల్స్ తో కళకళలాడుతున్నాయి.