Jaipal Reddy To lead Telangana Congressమాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లోకి తిరిగి రాబోతున్నారా? అంటే అవును అనే అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరుని నిర్మూలించడానికి ఆయన అయితేనే కరెక్ట్ అని హై కమాండ్ భావిస్తోందట. 2019 ఎన్నికలలో ఆయనే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఉండబోతున్నారని సమాచారం.

ఇటీవలే పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వల్ల పార్టీలో చాలా విబేధాలు తలెత్తాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాహుబలి అని ప్రచారం చెయ్యడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు చాల నొచ్చుకుంటున్నారు. ఆ పార్టీ కురువృద్ధుడు ప్రతిపక్ష నేత జానా రెడ్డి సైతం ఈ విషయంలో మీడియా ముందే తేలిపోయారు. పార్టీలో చేరితే బాహుబలి కాదు పార్టీ ని గెలిపిస్తే ఎవరైనా బాహుబలి అవుతారు అని చెప్పుకొచ్చారు.

దీనిబట్టి రేవంత్ ను కాంగ్రెస్ నేతలు ఎలా చూస్తున్నారో అర్ధం అవుతుంది. జైపాల్ రెడ్డి అయితే అందరి ఆమోదం ఉండే నేత అని హై కమాండ్ భావిస్తుంది. జైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి సొంత మామా. ఒకప్పుడు ఇద్దరికీ పడకపోయినా ఇప్పుడు ఒకే పార్టీ కాబట్టి ఇద్దరికీ కలిసి పనిచెయ్యడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదని హై కమాండ్ అంటుంది.

ఈ ప్రకటనకు ముందు ఆ పార్టీని మరింత బలపర్చడానికి కాంగ్రెస్ హై కమాండ్ పావులు కదుపుతుంది. బీజేపీ నుండి సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డిని పార్టీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాగం తెలంగాణ రాజకీయాలలో చాల సీనియర్ నేత, మంచి వాక్చాతుర్యం కలిగిన నేత. ఆయన చేరిక పార్టీకి ఉపయోగపడుతుందని హై కమాండ్ భావిస్తుంది