Jaipal Reddy comments on Congress and TDP (TS) allianceచెప్పింది అసలు చేయరు… చెప్పని వాటి గురించి అసలు పట్టించుకోరు… ఇది వర్తమాన రాజకీయ నాయకుల తీరు. దీనిని మారుద్దామనే ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారు… ‘చెప్తే ఎందుకు చేయరు… చేయలేనపుడు చెప్పడం దేనికి..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక్క పవన్ కళ్యాణే కాదు, పది మంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా, రాజకీయ నాయకుల తీరు మారదు, రాజకీయాలు మారవు అన్న దానికి నిదర్శనంగా మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఆగడాలను అణగద్రోక్కేందుకే వెలిసిన తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లల్లో ఏనాడూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు లేవు. ఆ ప్రతిపాదనలకు ఆస్కారం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు సాగాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ విజయపు జెండా ఎగురవేయడంతో, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. అయితే టిడిపి పరిస్థితి ముందుగా ఊహించిన విషయమే కాగా, అసలు షాక్ కాంగ్రెస్ పార్టీకే తగిలింది.

తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పట్టం కడతారని భావిస్తే… అలాగే రెండవ స్థానంలో ఉన్న టీఆర్ఎస్ ను కూడా కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా ‘సోలో పర్ఫార్మెన్స్’ ఇద్దామని భావించిన కాంగ్రెస్ కు ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమే అని బహిరంగంగా ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది. వాస్తవ పరిస్థితులకు వస్తే… తెలంగాణాలో టిడిపి కంటే కాంగ్రెస్ ఖాతాలోనే ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు.

కానీ, రానూ రానూ కాంగ్రెస్ మరింతగా బలహీనపడుతూ దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ‘ట్రెండ్’ను తెలంగాణాలో కూడా ఫాలో అవుతోంది. దీంతో ఒంటరిగా కంటే, తెలంగాణాలో క్షేత్రస్థాయిలో మంచి బలం ఉన్న తెలుగుదేశం పార్టీతో జత కడితే బాగుంటుందన్న ప్రతిపాదనలను మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. అయితే అంతిమ నిర్ణయం తెలుగుదేశం పార్టీకే వదిలిపెట్టారనుకోండి..! గతంలో ఉన్న శతృత్వ భావన ఇప్పుడు తమ రెండు పార్టీల మధ్య లేవు గనుక పొత్తు పెట్టుకోవచ్చన్న జైపాల్ వ్యాఖ్యలు వాస్తవ రూపం అయితే దాల్చే అవకాశాలు కనపడడం లేదు.

ఒక్కసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే… తెలంగాణాలో టిడిపికి ఎంత లాభమో, నష్టమో అన్న అంశం పక్కన పెడితే… ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా, లేకున్నా తెలుగుదేశం పార్టీకి చేకూరే ప్రయోజనం శూన్యం. ఒక రకంగా చెప్పాలి అంటే… కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వలన ఇంకా నష్టపోయే ప్రమాదమే తప్ప, పార్టీ పరంగా లాభపడే అవకాశం లేదు. అయినా… కాంగ్రెస్ విరోధిగా వ్యవస్థాపన జరిగిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అంటే కలే అని చెప్పాలి.