Jai-Simha-Vs-Agnyaathavaasiసంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయన్న అంశం స్పష్టం. ‘గుడ్డిలో మెల్ల’ ఏమిటంటే… ఉన్నంతలో “జై సింహా” మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. ఓవరాల్ గా ఈ రెండు సినిమాలు టాలీవుడ్ కు భారీ నష్టాలను మిగులుస్తాయన్నది స్పష్టమైన విషయం. కానీ ఎక్కువగా విమర్శకులకు టార్గెట్ అవుతోన్న హీరో మాత్రం పవన్ కళ్యాణ్ అన్నది సుస్పష్టం. రెండు తరాలకు చెందిన ఈ ఇద్దరి హీరోల స్థాయిని పోల్చలేం గానీ, బాలయ్య స్క్రీన్ పై చూపుతున్న గ్రేస్, ఈజ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలను ఎక్కుపెట్టేలా చేసింది.

ఏదో అలా సినిమాల్లోకి వచ్చాను తప్ప, తనకు నటనంటే పెద్దగా ఆసక్తి లేదని వివిధ సందర్భాలలో చెప్పుకునే పవన్, సిల్వర్ స్క్రీన్ పైన కూడా దానిని ప్రదర్శిస్తున్నారు. అందుకే విమర్శకులకు టార్గెట్ అవుతున్నారు. ‘తమ్ముడు, ఖుషీ’ కాలం నుండి ప్రారంభమైన అదే రకమైన నటనను రెండు దశాబ్దాలు గడిచినా కొనసాగిస్తున్న పవన్, అస్సలు కొత్తదనానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. దీనికి తోడు ‘అదో టైపు’ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం! తనకున్న మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించుకోవడానికి ఫైట్స్ ను వినియోగించుకుంటుండగా, పాటల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఉత్తమం అని చెప్పొచ్చు.

‘జై సింహా’ సినిమాలో ఈ వయసులోనూ బాలకృష్ణ రకరకాల స్టెప్పులు వేయడానికి ప్రయత్నించగా, కనీసం ట్యూన్ కు తగ్గట్లుగా కాలు కదపలేని పరిస్థితిలో పవన్ ఉండడం అనేది అత్యంత శోచనీయం. వయసు రీత్యా బాలయ్య కంటే చాలా తక్కువే అయినప్పటికీ, స్క్రీన్ పై ఉత్సాహం, ఉత్తేజంలో బాలయ్యదే పైచేయి. ఎంచుకున్న పనిని వంద శాతం నిబద్ధతతో పూర్తి చేసినపుడే, ఆ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అలా కాకుండా కాలయాపన కార్యక్రమాలు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయన్న హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే… తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అజిత్ “వేదాళం” రీమేక్ గా పవన్ ఎంచుకున్నారనేది ఫ్యాన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.