Jai Lava Kusa Trailer Talk - Perfectly Sets Up A Minimum-Guaranteeవర్తమాన స్టార్ హీరోలలో ఎవరూ చేయని సాహాసానికి జూనియర్ ఎన్టీఆర్ పూనుకున్నారు. డ్యూయల్ రోల్స్ చేయడమే ఇబ్బంది అనుకుంటున్న తరుణంలో, ఏకంగా ట్రిపుల్ రోల్ తో “జై లవకుశ” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తారక్. సెప్టెంబర్ 21వ తేదీన విడుదల కావడానికి అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసారు.

ట్రైలర్ ఎలా ఉంది? అన్న మాటను కాసేపు పక్కన పెడితే, ఈ ట్రైలర్ లో చివరి షాట్ లో తారక్ మూడు పాత్రలు ‘జై లవకుశ’లు ఒకే ఫ్రేంలో కనిపించడం అనేది ఫ్యాన్స్ కు ‘ఐ ఫీస్ట్’గా చెప్పవచ్చు. ఏ హీరో ఫ్యాన్స్ కైనా తమ అభిమాన హీరోను ఇలా మూడు పాత్రలలో ఒకేసారి చూడడం బహు అరుదు. ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ కు బాబీ దర్శకత్వం వహించిన ‘జై లవకుశ’ సినిమా ద్వారా ఆ అవకాశం చాలా తొందరగానే లభించింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… ఇప్పటికే మూడు టీజర్ల ద్వారా మూడు పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు, ఈ ట్రైలర్ ద్వారా వారిని ఎలా కలిపాడు అన్న పాయింట్ ను చూపించారు. ఒక తల్లికి పుట్టిన ముగ్గురు పిల్లలు సమాజంలో ఎలా తయారయ్యారు? అక్కడ నుండి ప్రేక్షకులకు పండించిన వినోదం ఏంటి అనేదే చిత్ర ప్రధాన కధగా కనపడుతోంది. ట్రైలర్ అంతా ఈ ముగ్గురు పాత్రల చుట్టూ తిప్పారే తప్ప, అసలు ఈ ముగ్గురు కలవడానికి గల పాయింట్ ను రివీల్ చేయలేదు.

సినిమా సక్సెస్ అనేది ఆ పాయింట్ పైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాలో కూడా ఇలాగే ముగ్గురు విడిపోయి, చివరికి విలన్లను మట్టి కరిపించడంలో చేరువ అవుతారు. ఈ సినిమాలో కూడా అదే పాయింట్ ను పట్టుకుంటే కొత్తదనం మిస్ అవుతుంది కనుక, బాబీ ఎలా తెరకెక్కించారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ తారక్ పోషించిన మూడు పాత్రలలో కూడా ‘లవకుశ’లు ఎంటర్టైన్మెంట్ కు పరిమితం కాగా, పవర్ ఫుల్ పాత్రగా ‘జై’ను రూపొందించారు.

దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ‘జై’ పాత్ర పైనే ఉండనున్నాయి. అందులోనూ లవకుశ పాత్రల ద్వారా ఎన్టీఆర్ కొత్తదనంగా చేసింది ఏమీ లేదు గానీ, తనదైన శైలిలో వినోదాన్ని పండించాడు. ‘నత్తి’గా మాట్లాడుతూ ‘జై’ రోల్ ద్వారా తనలోని మరో యాంగిల్ ను తారక్ సిల్వర్ స్క్రీన్ పై సరిగ్గా చూపిస్తే… బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిసినట్లే. ఇక అత్యున్నత సాంకేతిక విభాగం ఈ సినిమాకు పనిచేయడంతో ప్రొడక్షన్స్ వాల్యూస్ మరియు టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లోనే ఉంది. ఫైనల్ గా… గొప్పగా చెప్పుకోవడానికి లేదు గానీ… ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఓకే…!