Jai Lava Kusa Teaser 3బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తోన్న “జై లవకుశ” సినిమాకు సంబంధించి, మూడు టీజర్లను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ముందుగానే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు రెండు టీజర్లను విడుదల చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ, ఇక మిగిలిన మూడో టీజర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి, ఇక టీజర్స్ కు శుభంకార్డు వేసే పనిలో ఉంది.

అందులో భాగంగానే ఈ శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు ‘కుశ’ పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నామని అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ సమాచారంతో ‘యంగ్ టైగర్’ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘జై’ పాత్రకు అద్వితీయమైన స్పందన లభించగా, దానికి పూర్తి విభిన్నంగా ‘లవ’ పాత్రలో కనిపించడంతో, మూడవ పాత్ర అయిన ‘కుశ’ ఎలా ఉంటాడు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అయితే ఈ మూడు పాత్రలలో ‘కుశ’ పాత్రే ఎంటర్టైనింగ్ గా సాగుతుందని ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో స్పష్టమైన విషయం. దీంతో ఆ వినోదం ఏ స్థాయిలో ఉంటుంది? క్లాసా? మాసా? అన్న రీతిలో అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ టీజర్స్ తో మూడు పాత్రలు పరిచయం అయిపోతాయి కాబట్టి, ఇక ధియేటిరికల్ ట్రైలర్ ఒక్కటే మిగిలి ఉంటుంది. 10వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.