jai lava kusa public Talkజూనియర్ ఎన్టీఆర్ గా హీరోగా నటించిన “జై లవకుశ” సినిమాలోని ‘జై’ పాత్ర రాజకీయాలతో ముడిపడి ఉన్న విషయం వీక్షకులకు తెలిసిందే. తాను రాజకీయాలలోకి ఎదగడానికి తన ఇద్దరు తమ్ముళ్ళను కిడ్నాప్ చేసి, తన స్వార్ధానికి వాడుకున్న ‘జై’ పాత్రను, ‘నందమూరి – నారా’ కుటుంబాల మధ్య నెలకొన్న వర్తమాన రాజకీయాలకు ముడిపెడుతూ… జగన్ వర్గానికి చెందిన మీడియా వర్గాలు ప్రత్యేక కధనాలను రాయడం విశేషం. ఓ కమర్షియల్ సబ్జెక్ట్ తో తీసిన “జై లవకుశ” కధను చంద్రబాబు – జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య విభేదాలను ఎత్తిచూపుతోందన్న కధనం, “కోడిగుడ్డుపై ఈకలు పీకిన” సామెతను గుర్తు చేస్తోంది.

తెలుగుదేశంకు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు లేవని, అందుకు నిదర్శనంగానే ఎన్టీఆర్ చేరే పార్టీ పేరు ‘సమ సమాజ్ పార్టీ’గా నిర్ణయించారని, అదే సఖ్యతగా ఉంటే ‘జై దేశం, ఈ దేశం, మనదేశం’ వంటి పార్టీ పేర్లను పెట్టేవారని తమ సృజనాత్మకతను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సినిమాలో ఉన్న పోసాని కృష్ణమురళీ క్యారెక్టర్ చంద్రబాబును పోలి ఉంటుందని, హీరోను నెగ్ లెక్ట్ చేసే ‘మావయ్య’ పాత్రను రీల్ లైఫ్ లో పోసాని పోషించగా, రియల్ లైఫ్ లో ఇది చంద్రబాబుదని… ఎక్కడ లేని క్రియేటివిటీని చూపించారు. అయితే ఇంత క్రియేటివిటీని భరించడం మాత్రం వీక్షకుల వల్ల కావడం లేదు.

వీటితో పాటు “ఐ గాట్ ఎ కాల్ ఫ్రం ఢిల్లీ” అన్నది కూడా భారతీయ జనతా పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ చేరువ కావాలనే అభిలాషను వ్యక్తపరిచాడని, ఇప్పటివరకు బిజెపితో సఖ్యంగా ఉన్న పవన్ స్వరంలో మార్పు వస్తుండడంతో, ఈ సమయంలోనే బిజెపికి చేరువయ్యేలా ఈ డైలాగ్ పెట్టారని, రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని… ఓ సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇక ‘మనం’ అనేది నిజం కాదని, ‘నేను’ అనేదే నిజమని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ‘నందమూరి – నారా’ కుటుంబాలకు సంబంధించే అని… ఇలా తలా, తోక లేనటువంటి అంశాలన్నింటిని క్రోడీకరించుకుని, ఓ ప్రత్యేక కధనాన్ని తయారు చేసుకున్నారు.

వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు ఏ విధంగా అయితే సహజత్వానికి దూరంగా ఉంటాయో, వారికి సంబంధించిన మీడియా వర్గాలు కూడా అంతకంటే ఒక ఆకు ఎక్కువే చదివిన చందంగా తయారు కావడం విశేషం. ‘జై’ పాత్ర రాజకీయ కోణంలో ఉన్న మాట వాస్తవమే గానీ, నిజానికి సినిమా చూసిన తర్వాత దీనిని వర్తమాన రాజకీయాలను ముడిపెట్టే ఆలోచన మాత్రం ఏ ఒక్క ప్రేక్షకుడికి కలుగలేదు. ఎందుకంటే అది కధలో భాగం అయ్యింది తప్ప, బలవంతంగా చొప్పించినట్లు ఎక్కడా కనిపించలేదు. అలాగే వాస్తవంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి విభేదాలను ప్రతిబింబించినట్లు ఎక్కడా అనిపించలేదు.

‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’లో బ్రహ్మానందం చెప్పినట్లు… మీడియా జనాలకు క్రియేటివిటీ అవసరమే గానీ… తల, తోకా లేని మరీ ఇంత క్రియేటివిటీని కూడా వీక్షకులు భరించలేరేమో..!