‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ వరుస విజయాల పరంపరలో ‘యంగ్ టైగర్’ నటించబోతున్న తదుపరి సినిమా “జై లవకుశ”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ జూనియర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడన్న టాక్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను ఏర్పడేలా చేసింది. ఈ సినిమాలో ఒక పాత్ర ‘లవకుమార్’ వర్కింగ్ స్టిల్ రూపంలో విడుదలైన విషయం తెలిసిందే. ఆ స్టిల్ లో జూనియర్ మామూలుగానే కనపడడంతో అసలు పాత్ర ‘జై’నా? ‘కుశ’ల్ దా అన్నది కీలకంగా మారింది.

అయితే ‘ఫస్ట్ లుక్’ విడుదల తర్వాత అందరికీ ఓ స్పష్టత వచ్చేసినట్లే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశించే విధంగా ‘జై’ పాత్ర రూపకల్పన జరిగిందన్న విషయాన్ని ఈ సినిమా ‘ఫస్ట్ లుక్’ ద్వారా చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పింది. ఒక పోస్టర్ లో రౌద్రం, మరో పోస్టర్ లో రాజసం చూపిస్తూ విడుదల చేసిన రెండూ అభిమానులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. అయితే రెండు పోస్టర్లు వెనుక ‘రావణాసురుడు’ పది తలల ఫోటో కూడా ఉండడంతో, చిత్ర థీమ్… దుష్ట సంహారార్ధం ‘జై’ పాత్ర ఉండబోతుందన్న సంకేతాలను పంపించారు.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ రెండు పోస్టర్లు అభిమానులకు కడుపు నింపాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘స్పైడర్’ ఫస్ట్ లుక్స్ ను డామినేట్ చేసే విధంగా జూనియర్ ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాధ్యతలను తీసుకున్నారు.