Jai Lava Kusa and Spyder Collections ఈ దసరాకు విడుదలైన రెండు పెద్ద సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ కలెక్షన్స్ పై రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. అయితే అగ్ర హీరోల అభిమానులకు ఇదేమి కొత్త విషయం కాదు గానీ, గత కొన్ని సంవత్సరాలుగా కలెక్షన్స్ పై నిర్మాణ సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకుండా నిశ్శబ్దంగా ఉంటున్న విషయం తెలిసిందే. కానీ ‘జై లవకుశ’ సినిమాకు సంబంధించి 100 కోట్ల పోస్టర్ ను విడుదల చేయడం, అలాగే ‘స్పైడర్’ ఫస్ట్ డే నాడు 51 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్లు విడుదల చేయడంతో… ఈ కలెక్షన్స్ రగడ మళ్ళీ మొదటికొచ్చినట్లయ్యింది.

ఇద్దరు హీరోల అభిమానులు ‘మీవి ఫేక్ అంటే మీవి ఫేక్’ అంటూ సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి యుద్ధమే చేసుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… చివరికి రోడ్డున పడుతోంది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువే అన్నది మాత్రం అభిమానులు గుర్తించడం లేదు. ఫ్యాన్స్ లో ఉద్వేగం ఇలాగే ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థలకు కూడా తెలిసిన విషయమే, అలా అని వాళ్ళు ఇలా కలెక్షన్స్ తో కూడిన పోస్టర్లను రిలీజ్ చేయకుండా ఉండవచ్చు కదా… అంటే ఇలా కలెక్షన్స్ రిలీజ్ చేస్తే, అభిమానుల్లో మరింత ఉత్సాహం వచ్చి, మళ్ళీ సినిమాను ఒకటికి రెండు సార్లు చూస్తారనే స్వార్ధం నిర్మాతలలో కనపడుతోంది.

అయితే టాలీవుడ్ కు చెందిన తమ్మారెడ్డి భరద్వాజ వంటి పలువురు ప్రముఖులు ఈ కలెక్షన్స్ పై అనేక సందర్భాలలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇవన్నీ కేవలం “ఫేక్” నెంబర్స్ అని, వీటిల్లో ఏ మాత్రం నిజం లేదని, అవకాశం చిక్కినప్పుడల్లా మాట్లాడారు. మరోవైపు ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు కూడా ఈ కలెక్షన్స్ విషయంలో కాస్త “అతి” తెలివిని ప్రదర్శిస్తున్నట్లుగా కనపడుతోంది. ఓవరాల్ గా 50, 100 కోట్లు అని ప్రకటిస్తున్నారే తప్ప, ఏ ఏరియా నుండి ఎంత వచ్చింది అన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. అలా ఏరియాల వారీగా విభజించి ప్రకటిస్తే… అందులో నిజానిజాలు ఏంటో బహిర్గతమవుతాయి. ఇక్కడే “ఫేక్” ప్రస్తావన ఉత్పన్నమవుతోంది. ఒకవేళ నిజంగానే ఆ సినిమాలకు అన్ని కోట్లు వస్తే… ఏరియాల వారీగా ప్రకటించడానికి అభ్యంతరాలు ఏముంటాయి?

ఇదేమి “జై లవకుశ, స్పైడర్” సినిమాల సందర్భంలోనే జరగలేదు. ‘బాహుబలి 2’ మినహాయిస్తే… విడుదలైన ప్రతి పెద్ద సినిమా సమయంలో ఈ “ఫేక్” కలెక్షన్స్ రాజ్యమేలుతుంటాయి. ఆయా హీరోల అభిమానుల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతూనే ఉంటాయి. వీటికి ‘శుభంకార్డు’ పడాలంటే… ప్రేక్షకుల దృష్టిని కలెక్షన్స్ పై నుండి కధల వైపుకు మలిచేలా సినిమా యూనిట్ వర్గాలు చర్యలు తీసుకోవడమే. అలాగే కొందరు ‘పీఆర్వో’లు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ… ప్రమోట్ చేస్తోన్న ‘ఫేక్’ కలెక్షన్స్ కు నియంత్రణ పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ‘రివ్యూ’లపై విరుచుకుపడే సినీ జనాలకు ఈ ‘ఫేక్’ కలెక్షన్స్ అంశం పట్టదా… అంటే… అంతేలెండి… “ఎవరి వీపు వారికి కనపడదు కదా…” అన్న సమాధానంతో సరిపెట్టుకోవాలి.