YS-Sharmila-Jagga-Reddyతెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని విమర్శించినందుకు రెండుమూడురోజులుగా ఆయన వైఎస్ షర్మిల, సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేనిపోయినప్పుడు కాంగ్రెస్‌ నేతలమైన మేమందరం బాధపడుతుంటే, జగన్, షర్మిల ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతూ తెరచాటు ప్రయత్నాలు చేశారని’ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ‘వారిద్దరూ తండ్రి బాటలో నడవడం లేదు కానీ చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకొంటున్నట్లు, వైఎస్సార్ పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారని’ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ మోడీ, అమిత్‌ అమిత్‌ షా కనుసన్నలలోనే పనిచేస్తున్నారని అన్నారు.

ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటున్నారు కానీ వాటికి బదులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాలుగా విభజించుకొంటే వైఎస్ కుటుంబంలో ఈ పదవులు, అధికార పంచాయతీ తీరిపోతుంది కదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓ రాష్ట్రానికి, వైఎస్ షర్మిల మరో రాష్ట్రానికి, విజయసాయిరెడ్డి మూడో రాష్ట్రానికి ముఖ్యమంత్రులైపోవచ్చు కదా?

వైఎస్ షర్మిలకు తన కుటుంబంలో అధికార పంచాయతీ ఉంటే వెళ్ళి అన్న దగ్గర తేల్చుకోవాలి అంతేగానీ ఇక్కడ తెలంగాణకు వచ్చి పంచాయతీ పెట్టడం సరికాదు. అన్నతో పంచాయతీ తీరకపోతే ఆమె ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. నా జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేసుకొంటే నాకేమీ అభ్యంతరం లేదు కానీ అనవసరంగా నన్ను కెలికితే నేను ఇలాగే స్పందిస్తుంటాను. కనుక నా జోలికి రావద్దని వైఎస్ షర్మిలకి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గురించి, జగన్ ప్రభుత్వ తీరు నిర్ణయాల గురించి ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ నాయకులు ఏమనుకొంటున్నారో గ్రహించేందుకు జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చాలు. కానీ వైసీపీ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వైసీపీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీలో నేతలందరూ భుజాలు చరుచుకొంటున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత మూడేళ్ళుగా ఏమి జరుగుతోందని ప్రశ్నించుకొంటే రాజకీయాలు మాత్రమే అని చెప్పుకోవలసి ఉంటుంది.