Jagapathi babu responds on nandi awards controversy!హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించి, ఈ తరం విలక్షణ నటుల్లో ఒకరిగా నిలిచిన జగపతిబాబు నటించిన తాజా చిత్రం ‘రంగస్థలం’ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్న నేపధ్యంలో… ఓ పత్రికతో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని అంశాలలో తన అనుభూతులను పంచుకున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘కాస్టింగ్ కౌచ్’ అంశం హాట్ టాపిక్ కాగా, దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అమ్మాయిలకు లైంగిక వేధింపులు కేవలం సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదని, ఏ రంగంలోనైనా ఇవి జరుగుతూనే ఉంటాయని, అయితే సినిమా ఫీల్డ్ లో గ్లామర్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా చర్చ జరుగుతోందని జగపతిబాబు అభిప్రాయపడ్డారు. ఎవరైనా సరే, సన్నిహితంగా ఉంటేనే అవకాశాలు ఇస్తామని చెబితే, అందుకు అమ్మాయిలు గట్టిగా నిరాకరించాలని, తనవరకూ సినీ రంగం సురక్షితమైనదన్న అభిప్రాయమే ఉందని, తన కుమార్తెలు యాక్టింగ్ చేస్తానని చెబితే, అభ్యంతర పెట్టబోనని స్పష్టం చేశారు.

తన చిన్న కూతురు చదవలేక చదువుతుంటే, శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా? అని సలహా కూడా ఇచ్చానని, అయితే తన బిడ్డలకు ఈ రంగంపై ఆసక్తి లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు. తనకు పారితోషికం గురించిన ఆలోచనే రాదని, కొన్నిసార్లు డబ్బులు అడక్కుండానే సినిమాలు చేస్తానని చెప్పిన జగపతిబాబు, ఇటీవల ఓ చిన్న సినిమా కథనచ్చి, రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా నటించేందుకు అంగీకరించానని చెప్పారు.

తాను ఒకప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్నానని, అందుకు కేవలం తన అలవాట్లు మాత్రమే కారణం కాదని, తన నుంచి డబ్బు తీసుకున్నవాళ్లు ఎంతో మంది మోసం చేశారని చెప్పారు. ఈ విషయంలో తప్పు తనదేనని, తాను మోసపోయానని, సినిమా కారణంగా దెబ్బతిన్నానని చెప్పిన ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకుని, తన వద్ద ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నానని చెప్పారు. ఖర్చు పెట్టడానికే సంపాదించాలని, ఆనందంగా ఉండేందుకు డబ్బు కావాలన్నది తన సిద్ధాంతమని, గతంలో డబ్బు విలువ తెలియకుండా ఖర్చు చేశానని, ఇప్పుడు విలువ తెలుసుకుని ఖర్చు పెడుతున్నానని అన్నారు.