Jagapathi Babuటెక్నాలజీ ఎంత పెరిగినా మనిషి జీవన ప్రమాణాల్లో ఎన్ని మార్పులు వచ్చినా కులం మతం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాయి. పైపెచ్చు కొత్త రంగులు పులుముకుని వైషమ్యాలకు దారి తెస్తాయే తప్ప ఎలాంటి పురోగతికి మార్గం చూపించవు. తాజాగా జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో పదిహేనేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి వివరిస్తూ విజయవాడ సిద్దార్థ కాలేజీలో కులంకు వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పినప్పుడు ప్రిన్సిపల్ అది చాలా ప్రమాదమని, కుర్రాళ్ళంతా ఒకే సామజిక వర్గమని హెచ్చరిక చేయడాన్ని గుర్తు చేశారు. అంటే యువతలో అప్పట్లోనే ఈ జాడ్యం ఎంతగా నాటుకుపోయిందో చెప్పే ప్రయత్నమన్న మాట.

సరే ఇందులో తప్పొప్పుల గురించి పక్కనపెడితే అసలు సినిమాలకు సంబంధించి ఈ కులాల మరకలు ఎక్కడ మొదలయ్యాయి ఎక్కడ దాకా వెళ్లాయనేది చెప్పడం కష్టం కానీ పరిణామ క్రమాన్ని గమనిస్తే మాత్రం పలు ఆసక్తికరమైన సంగతులు కనిపిస్తాయి. 1938లో మాలపిల్ల వచ్చినప్పుడు దాని మీద విపరీత నిషేదాజ్ఞలు వచ్చాయి. అణుగారిన వర్గాల వ్యధలను ముఖ్యంగా దళిత కోణంలో చూపించే ప్రయత్నం చేసిన గూడవల్లి రామబ్రహ్మం గారి మీద చాలా వ్యతిరేకత వచ్చింది. బ్రాహ్మణ విధానాన్ని అందులో ఎండగట్టారు. ఆ టైంలో మీడియా లేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆనాటి అనుభవాల గురించి చదివితే వణుకొచ్చేలా ఉంటాయి.

అడపాదడపా ఇలాంటి ప్రస్తావనలు సినిమాల్లో ఉంటూ వచ్చినప్పటికీ వెనుకబడిన కులాలను ఉద్దేశించి వాళ్ళలో రావాల్సిన చైతన్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి దర్శకుడిగా తన మొదటి చిత్రం అర్ధరాత్రి స్వతంత్రం (1988)తోనే సంచలనం రేకెత్తించారు. నైజామ్ ప్రాంతంలోని పెత్తందారీ వ్యవస్థను తీవ్రంగా ఎండగట్టారు. ఈ బాటలోనే దాసరి లాంటి అగ్ర దర్శకులు నడిచి ఒసేయ్ రాములమ్మా లాంటి బ్లాక్ బస్టర్లు తీశారు. ఇక రాయలసీమలో ఫ్యాక్షన్ మొత్తం రెడ్లలోనే ఉంటుందని వెండితెరపై తొలిసారి చూపించిన సినిమాలుగా అందరూ ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి అనుకుంటారు కానీ నిజం అది కాదు.

ఇదే పరుచూరి బ్రదర్స్ 1992లో రాసిన కడప రెడ్డెమ్మ తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చింది. సీమ రెడ్ల మధ్య పగలు ప్రతీకారాలు ఏ స్థాయిలో ఉంటాయో శారద టైటిల్ రోల్ పోషించి నిర్మించిన ఆ సినిమాలో విపరీతమైన హింస ద్వారా చూపించారు. ఇది మొదటి అడుగు. ఆ తర్వాత వీళ్ళే బాలకృష్ణ బి గోపాల్ తో కలిశాక రకరకాల కులాల పేర్లతో అదో ట్రెండ్ గా మారిపోయింది. నరసింహనాయుడు, శేషాద్రి నాయుడు, రాయలసీమ రామన్న చౌదరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇప్పటికీ త్రివిక్రమ్, గోపిచంద్ మలినేని లాంటి న్యూ జనరేషన్ డైరెక్టర్లు సైతం వీటిని కొనసాగిస్తూనే ఉన్నారు. హిట్లు కొడుతూనే ఉన్నారు. ఇది ఆగేది కాదు, కులం మరకలు సినిమాల్లోనే కాదు సమాజంలోనూ చెరిగేవి కాదు.