Jagan ysrcpతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. అభ్యర్థులను ఫైనల్ చెయ్యడంలో టీడీపీ అన్ని పార్టీల కంటే ముందు ఉంది. అయితే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన ఒకటి రెండు రోజుల్లోనే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులపై చాలా వరకు కసరత్తు పూర్తి అయినట్టు తెలుస్తుంది.

అదే విధంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయని, సమర్థత ఉన్నవారిని పార్టీ ఉపయోగించుకోబోతుంది. వారు అభ్యర్థులకు చేదోడువాదోడుగా ఉంటూ వారి గెలుపే లక్ష్యంగా పని చేస్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు 82 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలకూ పార్టీ ఎన్నికల బాధ్యులను నియమించారు. ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకే వీరి నియామకాలు చేపట్టారు. మిగిలిన స్థానాలకు తొందర్లో నియమిస్తారు.

ఈ నియోజకవర్గాల్లో సామాజికవర్గాల వారీగా ఓటర్లు, పార్టీ సానుభూతిపరుల ఓట్లు, ప్రధాన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ పరిస్థితి, పార్టీపరంగా ఇంకా ఏయే అంశాల్లో ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది? వంటి విషయాలు క్రోడీకరించి వారికి ప్రశాంత్ కిషోర్ వివరించారట. ఇంకో 45 రోజులు త్యాగాలు చేయండి. అభ్యర్థులకు చేదోడువాదోడుగా ఉంటూ వారి గెలుపే లక్ష్యంగా పనిచేయండి. మీ భవిష్యత్తు గురించి నేను చూసుకుంటా అని జగన్ వారికి హామీ ఇచ్చారట.