YS_Jagan_YSRCP_MLC_Elections_2023_Results.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీకి తిరుగేలేదని సిఎం జగన్మోహన్ రెడ్డి ఢంకా బజాయించి మరీ చెపుతున్నారు. వైనాట్ 175 సీట్స్?అని ప్రశ్నిస్తున్నారు. టార్గెట్ కుప్పంతో చంద్రబాబుకి రిటైర్‌మెంట్ ఇస్తానని చెపుతున్నారు.

అయితే ఐదేళ్ళ తర్వాత జరుగబోయే ఎన్నికల కోసం అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతూ, వాలంటీర్ వ్యవస్థల ఏర్పాటు చేసుకొని సన్నాహాలు చేసుకొనేంత దూరదృష్టి కలిగిన వైసీపీ అధినేతకు, రాష్ట్రంలో ప్రజలు తన పాలన, తన అనాలోచిత నిర్ణయాల గురించి ఏమనుకొంటున్నారో తెలుసుకోలేరని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది.

Also Read – సురేఖగారూ… ఇది చాలా ఓవర్ కదా?

తన విధానాలు, నిర్ణయాలతో వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలుగుతుందని జగన్‌ కూడా నమ్ముతున్నారో లేదో తెలీదు కానీ వాటితో ఎంతో కొంత నష్టం జరుగబోతోందని గ్రహించే ఉంటారు. కానీ మడమ తిప్పే అలవాటు లేదు కనుక ఆ దిశలోనే ముందుకు సాగిపోతూ, ఏపీ గ్రోత్ రేట్ మహాద్భుతం… సంక్షేమ పధకాలతో 175 సీట్లు మనకే… మరో 30 ఏళ్ళు అధికారంలో మనమే… చంద్రబాబు నాయుడు ఇక ఇంటికే… అని ‘ఆల్ ఈజ్ వెల్’ పాట పాడుతూ తన మంత్రుల చేత కూడా కోరస్ పాడిస్తున్నారు. తద్వారా పార్టీలో అందరినీ భ్రమలో ఉంచుతూ ఎవరూ చెదిరిపోకుండా పట్టి ఉంచుతున్నట్లున్నారు.

ఎన్నికల అధికారులను, పోలీస్ వ్యవస్థను, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలను ఏవిదంగా ‘క్రాక్’ చేయాలో ఫార్ములా కనిపెట్టేశాము కనుక అందరూ నిశ్చింతగా ఉండవచ్చని, అంతవరకు ఈ మూడు రాజధానులతో, రాజకీయకక్ష సాధింపులతో కాలక్షేపం చేసేసినా ఎటువంటి ఇబ్బందీ ఉండదనే భావన పార్టీ నేతలలో బలంగా కలిగించిన్నట్లే ఉన్నారు. అందుకే వైసీపీ నేతలు కూడా ఇంతగా రెచ్చిపోతున్నట్లు భావించవచ్చు.

Also Read – స్పందన మంచిదేగా..!

కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలలో రెండింటిని టిడిపి గెలుచుకోవడంతో వైసీపీ నేతలందరూ ఈ జగన్మాయలో నుంచి భ్రమలలో నుంచి బయటపడాల్సిన సమయం వచ్చిన్నట్లే కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్ని అక్రమాలకు పాల్పడినా, ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమీషన్‌ ఆదేశించినా విచ్చలవిడిగా వాడేసుకొన్నా, సంక్షేమ పధకాల పేరుతో ఎన్ని లక్షల కోట్లు పంచినా వైసీపీకి కంచుకోటలు బద్దలైపోవడంతో వైసీపీ నేతలు షాక్ అవుతున్నారు. ఇంతకాలం తాము గుడ్డిగా అధినేతను నమ్ముకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాబోయే ఎన్నికలలో దెబ్బ తినబోతున్నామా?అనే భయం లేదా ఆలోచన బహుశః ఉత్తరాంద్ర, రాయలసీమ వైసీపీ నేతల్లో కలిగే ఉంటుంది.

Also Read – జానీ మాస్టర్‌… ఈ సమయంలో అవార్డ్ అవసరమా?


అయితే, ఇంతకాలం తమ చేతే టిడిపి, జనసేన నేతలను నోటికి వచ్చిన్నట్లు దూషింపజేస్తూ, ఇప్పుడు కంచుకోటకు మంటలు అంటుకొన్నా దానిలో నుంచి ఎవరూ గోడ దూకలేని పరిస్థితి తమ అధినేత కల్పించారనే విషయం కూడా బహుశః అందరికీ బోధపడి ఉండవచ్చు. కనుక వైసీపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారిందని చెప్పవచ్చు.