jagan went to delhi to meet amitshahమూడు రాజధానులను మరోసారి తెర మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. గత వారం దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అతితొందరలో మూడు రాజధానులు అన్నారు అయితే దాని పై ప్రభుత్వం నుండి కదలిక వచ్చినట్టుగా కనిపించలేదు.

అయితే మంత్రి బొత్స మరోసారి మీడియా ముందుకు వచ్చి అవే రకమైన వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. “మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఏక్షణం నుంచైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుంది,” అని ఆయన చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. జగన్‌ కేంద్రమంత్రి జవదేకర్‌తో భేటీ అయ్యారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి.

అయితే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను బీజేపీ పెద్దలు ఢిల్లీ పిలిపించుకున్నారు. ఆ వ్యవహారంతో బిజీ ఉండటం చేత అమిత్ షాకు ఈరోజు కుదరకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ అది నిజమైతే జగన్ రేపు కూడా ఢిల్లీలో ఉండి అమిత్ షాను కలిసే ఏపీకి తిరిగివస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.