Jagan - uncle murder case controvery
ఎన్నికల ముందు తన బాబాయి వివేకానంద రెడ్డి మృతి మీద తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం మీద నమ్మకం లేదని, ఈ కేసుని సిబిఐకి అప్పగించాల్సిందిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతుండగానే ఎన్నికలు జరగడం, జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి.

అప్పుడు సిబిఐ విచారణ కావాలన్నా జగన్, ఇప్పుడు వద్దు అంటున్నారు. వివేక కుమార్తె సునీత తమకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల మీద, కుటుంబసభ్యుల మీద అనుమానం ఉంది అంటూ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినా జగన్ సిబిఐ విచారణ వద్దనే అంటున్నారు.

తాజాగా ఆయన తాను వేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకుంటా అని, దానిని పరిగణలోకి తీసుకోవద్దని, ఈ కేసులో సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పడం విశేషం. జగన్ పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి కోర్టు ఒప్పుకుంటే వివేక కుమార్తె, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పిటిషన్లు మాత్రం సజీవంగానే ఉంటాయి.

మరోవైపు, జగన్ వైఖరిపై టీడీపీ విరుచుకుపడుతుంది. హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను ఎందుకు వెనక్కు తీసుకున్నారో చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. కేసు విచారణకు వచ్చే సమయంలో రిట్ ను వెనక్కి తీసుకోవడమేంటన్నారు. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశిస్తే అంతఃపుర రహస్యాలు బయటకొస్తాయనుకున్నారా? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.