Waltair_Veerayya_Veera_Simha_Reddy_Jaganతెలుగు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలవుతుంటాయి కనుక రెండు రాష్ట్రాలలో వాటి ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. ఆవిదంగానే నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ ఒంగోలు, విశాఖపట్నంలో జరిగాయి. వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి త్వరలో విశాఖపట్నంలో ఇల్లు కట్టుకొంటానని ప్రకటించడంతో అభిమానులు సంతోషంతో పొంగిపోయారు.

చిరంజీవి విశాఖలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించినందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో అభినందనలు తెలియజేయగా, వైసీపీ మద్దతుదారులు ఇందుకు భిన్నంగా స్పందిస్తుండటం విశేషం. సిఎం జగన్మోహన్ రెడ్డి దెబ్బకి భయపడే బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ ఆంద్రాలో పెట్టుకొన్నారని, చిరంజీవి కూడా అందుకే విశాఖలో ఇల్లు కట్టుకోబోతున్నారంటూ ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఓ విదంగా వారి వాదనలు నిజమే కావచ్చు. అయితే అందుకు వారే సిగ్గు పడాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా లేదా అభిమానంతో రావలసిన సినీ ప్రముఖులని, సినీ పరిశ్రమని బెదిరించి భయపెట్టి రప్పించుకోవడం గొప్ప విషయమా? సినిమాలని, సినీ రంగంలో ఉన్న ప్రముఖులని కూడా రాజకీయకోణంలో చూస్తూ చట్టాలు, నిబందనలపేరుతో ఇబ్బంది పెడుతుండటాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలరు?

ఒకప్పుడు ఎన్టీఆర్ ఒక్క పిలుపు ఈయగానే మద్రాస్‌లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌ తరలివచ్చేసింది. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకు?

రాష్ట్ర విభజన సమయంలో తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో అనేక ఇబ్బందులు పడింది. ఒకానొక సమయంలో ఏపీకి తరలిపోక తప్పదనిపించింది. కానీ తెలుగు సినీ పరిశ్రమ విలువని గుర్తించిన తెలంగాణ సిఎం కేసీఆర్‌ దానిని అక్కున చేర్చుకొని సముచిత గౌరవం ఇస్తున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారు సినిమా కార్యక్రమాలకి హాజరవుతూ ఎంతో ప్రోత్సహిస్తున్నారు.

ఏపీలో అటువంటి వాతావరణం ఉందా? అంటే లేదనే చెపుతున్నాయి వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్స్. వాటిని నిర్వహించుకోవడానికి నిర్వాహకులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసివచ్చిందో అందరికీ తెలుసు. ఇక పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకైతే ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కనుక పవన్‌ కళ్యాణ్‌ తను చేస్తున్న సినిమాలను ఎన్నికల తర్వాతే ఏపీలో విడుదల చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవే నిజమైతే అంతకంటే అవమానం మరొకటి ఉండదు.

కనుక తెలుగుప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్న మన తెలుగు సినీ పరిశ్రమని, దానిలో ప్రముఖులని గౌరవించి, ఆదరించి రాష్ట్రానికి రప్పించుకోగలిగితేనే బాగుంటుంది… అందరికీ సంతోషంగా ఉంటుందని గ్రహిస్తే మంచిది.