Jagan Thanks to Voters and Comments on TDP Governmentనంద్యాల ఉప ఎన్నికల ఫలితంతో ఖంగుతిన్న ‘జగన్ అండ్ కో,’ తమ ఓటమికి ప్రజల అవినీతే కారణం అన్న చందంగా మాటల దాడి కొనసాగిస్తోంది. ఎన్నికల ముందు గెలుపు కోసం ఇంటిoటికీ తిరిగి ఓట్లు అడిగే రాజకీయ పార్టీలు… ప్రజలే దేవుళ్ళు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే మాకు నాయకులు అంటూ… చాలా పెద్ద పెద్ద పదాలతో ప్రజలను పొగడ్తలతో మురిపిస్తారు. కాని ఫలితాలు వారు ఆశించిన దానికి వ్యతిరేకంగా వస్తే… అదే ప్రజలే డబ్బులకు అమ్ముడు పోయారని, మద్యానికి దాసోహం అయ్యారని, బెదిరింపులకు లొంగిపోయారని, సానుభూతికి కట్టుబడ్డారని… ఇలా ఎన్నో రకాల అభియోగాలు ప్రజలమీద గుప్పిస్తూ ఉంటారు.

ఎన్నికల ముందువరకు ప్రత్యర్ది పార్టీని గానీ, ఆ పార్టీ అభ్యర్దిని గానీ విమర్శిస్తూ ప్రచారాన్ని కొనసాగించే రాజకీయ పార్టీలు ఫలితాలు వెలువడగానే ఒక్కసారిగా ప్రజల మీద పడిపోతున్నారు. ఒకవేళ రాజకీయ పార్టీల ఆరోపణలు నిజమే అని సమర్దిoచినా ప్రజలను ప్రశ్నిoచే నైతిక హక్కు ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదనే సత్యాన్ని ఒప్పుకోని తీరాలి. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది ప్రజల దగ్గర నుండి రాబట్టిందే కాబట్టి ప్రజలను దోషులను చేసే హక్కు ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కాని, పార్టీకి గాని లేదు.

వర్తమాన రాజకీయాలు కరెన్సీ కట్టల చుట్టూనే తిరుగుతున్నాయనేది మన దేశంలో ‘డోరేమాన్’ చూసే పసివాడికి సైతం అర్ధమయ్యే విషయం. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అధికార పార్టీ వారు గెలిస్తే… అభివృద్ధికే ఓటు వేసారని, మా పాలనకే ప్రజలు పట్టం కట్టారని ప్రజలే దేవుళ్ళు అని వెలుగెత్తి చాటుతారు. అదే ప్రతిపక్ష పార్టీ విజయం సాధిస్తే… ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని, ప్రజలు న్యాయం వైపే నిలబడ్డారని, ప్రజలే మా నాయకులని ఆకాశానికి ఎత్తేస్తారు. అలా కాకుండా ప్రజల ఓట్లు వారికి వ్యతిరేకంగా వస్తే మాత్రం అందరూ చెప్పే ఏకైక కారణం… డబ్బుల పంపిణీ.

అధికార పార్టీ ఓటమిని చవిచూస్తే… ప్రతిపక్ష పార్టీ వారు ప్రజలకు వారి అవినీతి సొమ్మును విచ్చలవిడిగా పంపిణి చేసిందని, మాకు ఆ అవినీతి సొమ్ము లేదు కాబట్టే మేము గెలుపు సాధించలేకపోయామని వివరణ ఇస్తారు. అదే ప్రతిపక్షం వారైతే… అధికార పార్టీ కొన్ని వేళ కోట్లు కుమ్మరించిందని, అధికార దుర్వినియోగం చేసిందని అవి లేకపోతే విజయం తమదేనని విమర్శలు చేస్తుంటారు. నాయకుల విమర్శలు ప్రత్యర్దులను దాటుకొని ప్రజల వద్దకు వస్తున్నాయి అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఒక పార్టీ అధినేతలే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.

ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఖర్చును ఏదైనా ఓ వెనుకబడిన ప్రాంతానికి వినియోగిస్తే… అది అందరికి ఆదర్శంగా మారి, ప్రజలే స్వచ్చoధంగా వచ్చి మరి ఓటు వేసి వెళ్తారు. ఎప్పటికైనా అటువంటి రాజకీయాలు మన దేశంలో రావాలని, అంతటి ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు రావాలని, అలాగే విలువలతో, నిజాయితీతో కూడిన నేతలకే ఓటు వేయ్యాలనే ఆలోచనలోకి ప్రజలు ఎదగాలని ఆశిద్దాం. అప్పటివరకు ఈ రాజకీయ నాయకుల చేతులలో ప్రజలు నలిగిపోతూనే ఉంటారు.