Bhavishyathu Ku Guaranteeవైసీపీలో అనేకమంది కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, వారినెవరినీ జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లు లేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం మేమందరం పెద్ద జీరోలం, మాకు జగనన్నే దిక్కు… ప్రజలు ఆయన మొహం చూసే మాకు ఓట్లు వేస్తారని నిర్లజ్జగా చెప్పుకొంటున్నారు.

వారు జగనన్నను నమ్ముకొంటే, యువనేత జగన్‌, తనని గెలిపించేందుకు ఐప్యాక్‌ని నమ్ముకోవడం విచిత్రం. కానీ టిడిపి ఏ ప్యాక్‌ని నమ్ముకోలేదు. వైసీపీ ఎద్దేవా చేస్తున్నఆ ‘ముసలాయన’ చంద్రబాబు నాయుడే కొమ్ములు తిరిగిన తన పార్టీ నేతలతో చర్చించి, ఇటువంటి గొప్ప వ్యూహాలను రచించి అమలుచేస్తున్నారు.

కానీ జగన్‌ ఐప్యాక్‌ని నమ్ముకొంటే అది ఇంటింటికీ మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి “మా నమ్మకం, మా భవిష్యత్‌ నువ్వే జగన్‌” స్టిక్కర్లు అంటించమని ఓ పిచ్చి సలహా ఇచ్చింది. మంత్రి పదవులు వెలగబెడుతున్న రోజావంటివారు భుజానికి వైసీపీ సంచులు తగిలించుకొని, తమ నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్ళి స్టిక్కర్స్ అంటిస్తుండటం చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ ఆ ప్రయోగం వికరించడంతో ఇప్పుడు వైసీపీలో ఎవరూ ఆ ప్రస్తావన చేయడం లేదు.

వైసీపీ నేతలు మరిచిపోయినా, టిడిపి మరిచిపోలేదు. దానికి కౌంటరుగా మహానాడులో ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ అంటూ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ బొమ్మతో లోగో విడుదల చేసింది.

వైసీపీ బలవంతంగా ప్రజల ఇళ్ళకి స్టిక్కర్స్ అంటిస్తే, రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు టిడిపి ఏవిదంగా గ్యారెంటీ ఇస్తుందో మహానాడులో చంద్రబాబు నాయుడు వివరించారు.

తాము కూడా సంక్షేమ పధకాలన్నిటినీ అమలుచేస్తామని చెపుతూనే, అప్పులు చేసి డబ్బులు పంచడం, సంపద సృష్టించి పంచడం రెండూ వేర్వేరని చంద్రబాబు నాయుడు విస్పష్టంగా చెప్పారు.

యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, బీసీలకు వేర్వేరుగా సంక్షేమ పధకాలను ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్ధిక సాయం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇంట్లో పిల్లలందరి చదువులకు మళ్ళీ వేరేగా సాయం, రైతులకు ఏడాదికి రూ.20,000లు ఆర్ధిక సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించారు.

ఊహించినట్లే వైసీపీలో అప్పుడే కలవరం మొదలైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, మాజీ మంత్రి కొడాలి నాని, ఇంకా పలువురు వైసీపీ నేతల కడుపు మంటను ట్విట్టర్‌లో చల్లార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరికైనా ఆందోళన పెరిగితే ఎసిడిటీ (కడుపు మంట) రావడం సహజమే కదా?కనుక వైసీపీ కడుపుమంటకు ఆందోళనే కారణమని అర్దమవుతోంది.

వచ్చే ఎన్నికలలో గెలిచేందుకే చంద్రబాబు నాయుడు భూటకపు హామీలు ఇస్తున్నారని, వాటిని ఆయన అమలుచేయరని వాదిస్తున్నారు. ఒకవేళ ఆయన అమలుచేయకపోతే అప్పుడే వారు చంద్రబాబు నాయుడుని నిలదీయవచ్చు. కానీ అప్పుడే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసిన్నట్లు, హామీలు అమలుచేయన్నట్లు ఆయనపై విరుచుకుపడుతుండటం విశేషం. ఇది కూడా వారు ఓటమికి అప్పుడే సిద్దపడిపోయారని సూచిస్తోంది. తమ సంక్షేమ పధకాలను టిడిపి ఎదుర్కోలేదని గుడ్డి నమ్మకంతో ఉన్న వైసీపీ నేతలకు చంద్రబాబు నాయుడు గట్టి షాక్ ఇవ్వడమే కాదు… వాటికంటే మరింత ఎక్కువ ఇస్తామని వైసీపీ హామీ ఇవ్వకతప్పని పరిస్థితి కల్పించారు. కనుక ఐప్యాక్ బృందం మళ్ళీ బుర్రలు బద్దలు కొట్టుకోవలసిందే.