Nara-Lokesh-Jaganప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించేది చక్కటి పాలన, రాష్ట్రాభివృద్ధి, నియోజకవర్గాల స్థాయిలో సమస్యల పరిష్కరణ మాత్రమే. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ మూడు నెరవేర్చలేకపోయింది. మూడు రాజధానులు, సంక్షేమ పధకాలు, అప్పులు, టిడిపిపై రాజకీయ కక్ష సాధింపులతోనే మూడేళ్ళ పుణ్యకాలం గడిచిపోయింది. వచ్చే ఎన్నికలలో 175 స్థానాలు మేం గెలుచుకొంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ త్వరలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు, 50-60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకతప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికలలో ఎదురీత తప్పదని గ్రహించినందున వైసీపీ మరో కొత్త వ్యూహం అమలుచేస్తోందిప్పుడు. వచ్చే ఎన్నికలలో టిడిపిని దెబ్బతీయాలంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి ముఖ్యనేతలను టార్గెట్ చేసుకొని వారి నియోజకవర్గాలలోనే దెబ్బ తీయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజానికి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి ముఖ్య నేతల ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు వారి నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు లేదా పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జీలను మళ్ళీ గెలిపించుకొనేందుకు భారీగా నిధులు విడుదల చేస్తోంది.

చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో భరత్‌ను అభ్యర్ధిగా ప్రకటించి కుప్పంలో అభివృద్ధి పనులకి రూ.66 కోట్లు విడుదల చేసింది. టిడిపిలో కీలకపాత్ర పోషిస్తున్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ని ఓడించేందుకు జగన్ ప్రభుత్వం మంగళగిరి అభివృద్ధి పనులకు రూ.133.11 కోట్లు విడుదల చేసింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఈవిషయం ట్విట్టర్‌ ద్వారా తెలియజేసి, తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులు విడుదల చేసినందుకు సిఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ఇంతకాలం కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలలో సమస్యలను పట్టించుకోని జగన్ ప్రభుత్వం, తమను ఓడించేందుకైనా నిధులు కేటాయిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నామని, తమకు రాష్ట్రాభివృద్ధే ముఖ్యం తప్ప అధికారం, పదవులు కావని చంద్రబాబు నాయుడు ఇదివరకే చెప్పారు. కనుక రాష్ట్రంలో మిగిలిన 173 నియోజకవర్గాలకు కూడా యుద్ధ ప్రాతిపదికన ఇదేవిదంగా నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

తమ సంక్షేమ పధకాలు, పరిపాలన చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు 175 సీట్లు ఇస్తారని సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్నప్పుడు, మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండటం గమనిస్తే వైసీపీ అధినేతది కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమేనని, చాలా అభద్రతాభావంలో ఉన్నారని అర్దమవుతోంది.

నిజానికి అధికారంలోకి రాగానే ఈవిదంగా నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేపట్టి ఉండి ఉంటే నేడు టిడిపిని చూసి ఇంత భయపడాల్సిన అవసరమే ఉండేదే కాదు.

కానీ నేటికీ ప్రజల కోసం నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని కాకుండా టిడిపి ముఖ్య నేతలను ఓడించాలని నిధులు కేటాయిస్తుండటం గమనిస్తే నేటికీ వైసీపీ ప్రభుత్వానికి చేస్తున్న పనిలో చిత్తశుద్ధి లేదని అర్దమవుతోంది. ఈవిదంగా చేస్తున్న ప్రతీపనిలో ఏదో ఆశించి చేస్తుండటం వలననే ప్రజలు కూడా వైసీపీని నమ్మలేని పరిస్థితి ఏర్పడుతోంది. చేస్తున్న పనిలో చిత్తశుద్ధి లేకపోవడమే వైసీపీ బలహీనత. దానిని అధిగమిస్తే తప్ప లక్ష్యం సాధించలేదు.