Anam Ramnarayana Reddy cooments on his own YSR Congress partyవైసీపీ సీనియర్ నేతలలో ఒకరైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డి కన్నెర్ర చేశారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయనను తప్పించి వ్యతిరేక వర్గానికి చెందిన నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డికి అప్పగించారు. అందుకు కారణం… గత కొన్ని రోజులుగా ఆయన తన నియోజకవర్గంలో సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడుతూ వాటిని పరిష్కరించడంలో తమ ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించడమే! ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను మళ్ళీ తమకే ఓట్లు వేయాలని ఏ మొహం పెట్టుకొని అడగగలమని ప్రశ్నించారు. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘మన ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ముందస్తుకి వెళితే మనం అందరం ముందుగానే ఇంటికి వెళ్ళిపోవలసివస్తుంది,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో ఉంటూ అధినేతని, ప్రభుత్వ విధానాలని తప్పు పట్టినందుకు ఎంపీ రఘురామ కృష్ణరాజుకే అరికాళ్లు వాచిపోయాయి. ఇక ఆనం రామనారాయణ రెడ్డి ఎంత?అందుకే ఆయనపై కూడా వేటు పడింది.

నెల్లూరు జిల్లాకే చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల తన నియోజకవర్గంలో పెన్షన్స్ నిలిపివేయడం గురించి మాట్లాడారు. అయితే ఆయన తమ ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా, తమ అధినేత కోణంలో నుంచే మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికీ తప్పక పెన్షన్ అందుతుందని, ఒకవేళ అందకపోతే తాను వారికి అందేలా చేస్తానని చెప్పారు. ఈ విషయం సిఎం జగన్‌ దృష్టికి వెళ్ళడంతో కోటంరెడ్డిని పిలిపించుకొని మాట్లాడి, ఈ సమస్యని పరిష్కరించాలని జిల్లా అధికారులకి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డిని పిలిపించుకొని సంజాయిషీ అడగలేదు. వేటు వేశారు!

సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిస్తే మళ్ళీ వారికే ఆ సీటు కేటాయిస్తున్నట్లు లెక్క. ఒకవేళ తప్పించి వేరే వారికి ఆ బాధ్యత అప్పగిస్తే ఆ సీటుకి అతను లేదా ఆమెకి ఖరారు చేసిన్నట్లే. కనుక వచ్చే ఎన్నికలలో ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్‌ ఇవ్వబోమని తేల్చి చెప్పేసిన్నట్లే భావించవచ్చు. కనుక ఆయనని పార్టీలో నుంచి పొమ్మనకుండా పొగబెట్టిన్నట్లే భావించవచ్చు. కనుక ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డే ఏం చేయాలో నిర్ణయించుకోవలసి ఉంటుంది.