Jagan Shocks maa president vishnuతెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న టికెట్ ధరల అంశంపై తొలిసారిగా ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఇటీవల ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ మీడియా మీట్ లో చిరంజీవి – జగన్ ల కలయిక కేవలం వ్యక్తిగతమైనదని సింపుల్ గా ఓ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒకటుంది, సమస్యను పరిష్కరించే దిశగా అది అడుగులు వేస్తుందన్న అభిప్రాయాన్ని ‘మా’ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా మీడియా ముందు వ్యాఖ్యానించారు. అయితే నేడు జరిగిన సమావేశంతో ‘మా’ ప్రెసిడెంట్ కు జగన్ ఝలక్ ఇచ్చినట్లయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

నాడు వ్యక్తిగత సమావేశం అని నోరు జారిన ‘మా’ ప్రెసిడెంట్, ఇప్పుడు చిరు వెంట మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివలు కూడా వెళ్లారు, నేడో రేపో అన్న చందంగా సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుందని చెప్పారు. మరి నేటి సమావేశం కూడా చిరు – జగన్ ల వ్యక్తిగత కలయిక అని చెప్పే సాహాసం చేస్తారా? అలాగే చిరు వెంట ఉన్న హీరోలు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాల కోసమే జగన్ వద్దకు చేరుకున్నారని అంటారా?

అంతే గాక టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి చిరంజీవి చూపిన శ్రద్ధ ఏ పాటిదో మంత్రి పేర్ని నాని స్పష్టంగా తెలియజేస్తూ చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు మహేష్, ప్రభాస్, రాజమౌళి వంటి వారు కూడా ముందుగా మెగాస్టార్ చూపిన చొరవనే ప్రస్తావిస్తూ, జగన్ కంటే ముందు మెగాస్టార్ నే కీర్తిస్తూ ప్రసంగించారు.

ఉన్నతమైన పదవిలో ఉండి చిరంజీవి అంతటి స్థాయి వ్యక్తిని కించపరిచే విధంగా లేక తక్కువ చేసి మాట్లాడే విధంగా మంచు విష్ణు మాట్లాడడం అప్పుడే హాట్ టాపిక్ అయ్యింది. నేడు జరిగిన సమావేశంలో మెగాస్టార్ రోల్ ఏమిటో అందరికీ తెలిసివచ్చిది, అసలు సమస్య పరిష్కారం అవుతుందంటే దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవే అన్న క్లారిటీ అందరికి వచ్చేసింది.

బహుశా ఈ దిశగా తన మాటలను సవరిస్తూ మంచు విష్ణు మరో ప్రకటన చేస్తారేమో చూడాలి. ఓ వైపు తన సన్నిహితులు ‘జగన్ అండ్ కో’ మెగాస్టార్ పట్ల అంత ప్రాముఖ్యత ఇస్తుండగా, మంచు మాత్రం కాస్త పరిధి దాటారన్న టాక్ వినపడుతోంది. దీంతో సీఎం జగన్ కూడా మంచు కుటుంబానికి, ముఖ్యంగా ‘మా’ ప్రెసిడెంట్ కు భారీ షాక్ ఇచ్చినట్లుగా కనపడుతోంది.