Jagan-Visakhapatnamజగనన్న ఏం చేసినా ఏం మాట్లాడినా దాని అర్దం, పరమార్ధం వేర్వేరుగా ఉంటాయని ఆనాడు సమైక్యాంద్ర, ప్రత్యేక హోదా పోరాటాల మొదలు నేడు సంక్షేమ పధకాలు, మూడు రాజధానుల వరకు అన్నీ స్పష్టం చేస్తూనే ఉన్నాయి. తాజాగా మొన్న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సభలో ‘సెప్టెంబర్ నుంచి తాను విశాఖలో కాపురం పెడతానని జగనన్న ప్రకటించడం కూడా అటువంటిదే అని మంత్రి దాడిశెట్టి రాజా స్వయంగా బయటపెట్టేశారు.

కాకినాడ జిల్లా తుని మండలంలో విలేఖరులతో మాట్లాడుతూ, “సిఎం జగన్‌ తప్పకుండా విశాఖలో కాపురం పెడతారు. దాంతో ఉత్తరాంద్రలో టిడిపి అడ్రస్ లేకుండా పోతుంది. జగన్‌ షిఫ్ట్ అయిన తర్వాత విశాఖ రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తారు,” అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు.

ఇంతకాలం ఉత్తరాంద్ర జిల్లాల అభివృద్ధి కోసమే విశాఖను రాజధానిగా చేయాలనుకొంటున్నామని మంత్రులు చెప్పుకొంటున్నారు. కానీ మూడు రాజధానులు కూడా ఓ రాజకీయ వ్యూహమే తప్ప పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మాత్రం కాదనే చెప్పవచ్చు. ఏవిదంగా అంటే, టిడిపి, జనసేనలు అమరావతి రాజధానిగా కట్టుబడి ఉన్నాయి కనుక ఈ మూడు రాజధానుల పేరుతో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంద్ర ప్రజలలో ప్రాంతీయవాదాన్ని రగిలించి వాటిని రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో అడుగుపెట్టనీయకుండా చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. రాయలసేమ, ఉత్తరాంద్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రాజధానుల కోసం అంటూ ర్యాలీలు, సభలు నిర్వహించడం, ప్రజలను రచ్చగొట్టేందుకు ప్రయత్నించడం అందరూ చూశారు కదా?

కనుక ఉత్తరాంద్రలో టిడిపిని రాజకీయం దెబ్బ తీసేందుకే జగన్‌ విశాఖలో కాపురం పెడతానని ప్రకటించారని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పకనే చెప్పారు. అంటే విశాఖలో జగన్‌ కాపురం కూడా ఆ వ్యూహంలో భాగమే తప్ప విశాఖనో, ఉత్తరాంద్రనో ఉద్దరించడానికి కాదని అర్దమవుతోంది.

సిఎం జగన్‌ ప్రకటనపై వైసీపీకి, సిఎం జగన్మోహన్ రెడ్డికి బాకా ఊదే ఓ మీడియా కూడా ఇది వ్యూహాత్మకమే అని తేల్చి చెప్పేసింది. వివేకా హత్య కేసుపై వస్తున్న వార్తల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే జగనన్న వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసి ఉండవచ్చని పేర్కొంది. అంటే జగనన్న ఏం మాట్లాడినా, ఏం చేసినా ఆ వినబడేది, కనబడేది నిజం కాదని వాటి వెనుక ఏదో పరమార్ధం దాగి ఉంటుందని మరోసారి స్పష్టమవుతోంది.

రాజకీయాలలో ప్రత్యర్ధులను ఎదుర్కోవడానికి వ్యూహాలు చాలా అవసరమే కానీ ప్రజలను మభ్యపెట్టడానికి కూడా వ్యూహాలు పన్నితే వాటిని తిప్పికొడతారని ప్రతీ ఎన్నికలలో ప్రజలే తెలియజేస్తున్నారు కదా?