Jagan rule turned out blessing for KCRదేశమంతటా ఉన్న బొగ్గు కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నట్లుగా చెప్తూ, రాబోయే కాలంలో కరెంట్ కోతలు అనివార్యమని సకల శాఖా మంత్రిగా పిలవబడుతున్న సజ్జల ఇటీవల ఓ ప్రకటన చేసారు. అయితే ఇప్పటికే కరెంట్ కోతలు అమలవుతున్న విషయాన్ని సజ్జల ప్రస్తావించలేదు.

కానీ పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ వారు మాత్రం ఏపీ పవర్ కష్టాలను చూపిస్తూ కేసీఆర్ సర్కార్ పనితీరును ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి శాపంగా మారిన జగన్ పాలన తెలంగాణా ప్రభుత్వానికి వరంగా కనపడుతోంది.

తాజాగా కేసీఆరే ఆంధ్రప్రదేశ్ లోని కరెంట్ కోతలను ఉదహరిస్తూ తన సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించుకున్నారు. విభజన జరిగితే తెలంగాణా అంధకారంలోకి వెళ్ళిపోతుందని ప్రచారం చేసారు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో కరెంట్ లేదు, మనకి 24 గంటలు ఉంది అంటూ పరోక్షంగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేసారు.

2014లో విభజన జరిగిన నాటి నుండి పవర్ జనరేషన్ పై ఎప్పుడూ ఏపీని దొప్పిపొడవని కేసీఆర్ కు, జగన్ ఓ మంచి అవకాశాన్ని ఇచ్చినట్లయింది. ఎందుకంటే చంద్రబాబు పాలన ముగిసే సమయానికి ఏపీలో మిగులు విద్యుత్ ఉండగా, నేడు కరెంట్ కష్టాలతో రాష్ట్రం సతమతమవుతోంది.

ఇదే పొరుగు రాష్ట్రాలకు అదునుగా మారి, ప్రతిసారి ఏపీతో పోలుస్తూ తమ రాష్ట్రం మరింత ఉత్తమం అని ప్రజలకు ప్రచారంగా చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ను అంతటి దయనీయ స్థితిలోకి నెట్టిన ఘనతను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. సీఎంగా ఏపీకి ఎంతటి సేవలందిస్తున్నారో పక్కన పెడితే, పొరుగు రాష్ట్రాలకు మాత్రం ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు.