jagan requested cbi for paris tourఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రంలో కోట్లాదిమంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. రాష్ట్రం దశదిశా ఏవిదంగా ఉండాలో ఆయనే నిర్ణయిస్తారు. రాజధాని ఎక్కడ ఉండాలో, న్యాయ రాజధాని ఎక్కడ ఉండాలో ఆయనే నిర్ణయిస్తారు. రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ ఆయన చేతిలోనే ఉంటుంది. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సహా లక్షలాది ప్రభుత్వోద్యోగులు, అధికారులు ఆయన కింద పనిచేస్తుంటారు. ఆయన నిర్ణయాలు, ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని పనులు జరుగుతుంటాయి. మరో విదంగా చెప్పాలంటే ఆయన అనుమతి లేనిదే రాష్ట్రంలో చీమైనా కదలదు. రాష్ట్రంలో అన్నిటికీ ముఖ్యమంత్రే సర్వస్వం.

ఇంత శక్తివంతుడైన ముఖ్యమంత్రి విదేశానికి వెళ్ళాలంటే సిబిఐ అనుమతి పొందాల్సిరావడం చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది వాస్తవం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28వ తేదీన వ్యక్తిగత పర్యటనగా పారిస్ నగరానికి వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రి పెద్ద కుమార్తె హర్షారెడ్డి అక్కడ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. జూలై 2వ తేదీన జరిగే కాన్వోకేషన్ కార్యక్రమంలో ఆమె డిగ్రీ పట్టా అందుకోబోతున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి పారిస్ వెళ్ళాలనుకొంటున్నారు.

అయితే అక్రమాస్తుల కేసులలో సిబిఐ కోర్టు ఆయనను బెయిల్‌పై విడుదల చేస్తున్నప్పుడు దేశం విడిచి వెళ్లరాదనే షరతు విధించినందున, పారిస్ వెళ్ళేందుకు అనుమతివ్వాలని కోరుతూ సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకొన్నారు. ఈ నెల 28 నుంచి వారం రోజుల పాటు విదేశానికి వెళ్ళి వచ్చేందుకు అనుమతించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుని అభ్యర్ధించారు.

రాష్ట్రంలో ఓ సాధారణ పౌరుడు ఎటువంటి ఆంక్షలు, అనుమతులు అవసరం లేకుండా దేశవిదేశాలకు వెళ్ళి రాగలడు. కానీ సర్వశక్తివంతమైన ఓ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి పొందాల్సి రావడం ఆశ్చర్యంగానే ఉంటుంది. సిఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరగానే ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటాయి. ఈ అక్రమాస్తుల కేసుల విచారణ ఏళ్ళ తరబడి సాగుతూనే ఉన్నాయి తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలనుకొన్న ప్రతీసారి ఈ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోక తప్పడం లేదు.