Jagan Polavaram Re-Tendersపోలవరం హైడెల్ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో చేసుకున్న నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. అలాగే రివర్స్ టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఆ తరువాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలవనరుల శాఖకు పంపిన రిపోర్టులో కూడా పోలవరం కాంట్రాక్టు రద్దు చెయ్యడానికి ఎటువంటి సహేతుకమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం చూపించలేకపోయిందని చెప్పుకొచ్చింది.

ఇంత జరిగాకా ఇప్పుడు ఆ కారణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెతకడం మొదలు పెట్టింది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులలో జరిగిన అవకతవకలపై ,అవినీతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఏదో ఒక కారణం దొరికితే ఆ ప్రాతిపదికన నవయుగను ఈ ప్రాజెక్టు నుండి తప్పించవచ్చని రాష్ట్రప్రభుత్వం అభిప్రాయంగా కనిపిస్తుంది. మరోపక్క హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా తమకు అనుకూలమైన తీర్పు వచ్చేలా ఆలోచనలు చెయ్యాలని జగన్ అధికారులను ఆదేశించారు.

హైకోర్టు సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పుని డివిజనల్ బెంచ్ ముందు సవాలు చెయ్యాలని ప్రాధమికంగా నిర్ణయించారు. అయితే ఈలోగా నవయుగను తప్పించేందుకు ఒక్క కారణమైనా పట్టుకోవాలని ముఖ్యమంత్రి సూచన. మరోవైపు ఈ విషయంగా కేంద్రం తన అభిప్రాయాన్ని ఈ వారంలో చెప్పే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లైన్ కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండేలా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు.